వన్ టైమ్ సెటిల్మెంట్‌కు సిద్ధం
సరైన విచారణ లేకుండా ప్రభుత్వం దోషిగా నిలబెడుతోంది: మాల్యా ట్వీట్లు
న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా.. సరైన విచారణ జరపకుండానే ప్రభుత్వం తనను దోషిగా నిలబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇతర రుణగ్రహీతల్లాగానే తమకు కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం ఇవ్వాలని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘కోర్టులు ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాను. కానీ సరైన విచారణ జరపకుండా నన్ను దోషిగా నిలబెట్టాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్ నాపై మోపిన అభియోగాలే ప్రభుత్వ ధోరణికి నిదర్శనం‘ అని మాల్యా పేర్కొన్నారు.
సంక్షోభంతో మూతబడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి మాల్యా దాదాపు రూ. 9,000 కోట్లు బ్యాంకులకు బకాయి పడిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 2న దేశం విడిచి వెళ్లిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నారు. మరో సంస్థ డయాజియో నుంచి లభించిన 40 మిలియన్ డాలర్లు కోర్టులో జమ చేసేదాకా మాల్యా మాటలు వినిపించుకోవాల్సిన అవసరమే లేదంటూ బ్యాంకుల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్‌గీ కోర్టులో వాదించారు. కోర్టు ధిక్కరణ అభియోగాలపై నోటీసులు జారీ అయిన దరిమిలా ఆయన న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్నారు.
మరోవైపు, వన్ టైమ్ సెటిల్మెంట్ కోసం తాము సిద్ధమని చెప్పినా బ్యాంకులు తమ ప్రతిపాదనను కనీసం పరిశీలించలేదని, ఎకాయెకిన తిరస్కరించాయని మాల్యా తెలిపారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వన్ టైమ్ సెటిల్మెంట్ విధానాలు ఉంటాయి. వందల కొద్దీ రుణ గ్రహీతల ఖాతాలు సెటిల్ అవుతుంటాయి. మాకు అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు‘ అని ఆయన ప్రశ్నించారు.