
వడ్డీ రేట్ల కోతకు
అనువైన పరిస్థితులు: జైట్లీ
న్యూఢిల్లీ: కమోడిటీల ధరలు తగ్గడం, ఖరీఫ్ పంటల అంచనాలు ఆశావహంగా ఉండటం మొదలైన వాటితో వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. భారత్ దృష్టి కోణం నుంచి చూస్తే అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు, కమోడిటీల ధరలు సానుకూలంగానే ఉన్నాయని, ఈ ఏడాది వరుణ దేవుడు కూడా కరుణ చూపించాడని ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.
ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. ప్రభుత్వం లాగానే రిజర్వ్ బ్యాంక్ కూడా ఎకానమీ పరిస్థితుల గురించి ఆలోచిస్తుందని, సమతూకమైన నిర్ణయం తీసుకుంటుందని జైట్లీ చెప్పారు. ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయానికి సంబంధించి కేంద్రం వద్ద నిర్దిష్ట ప్రణాళిక ఉందని, మార్కెట్ శక్తులు పనిచేసే తీరుతెన్నుల దృష్ట్యా దాన్ని ముందస్తుగా వెల్లడించలేమని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు విదేశీ కంపెనీల ఆసక్తి
భారత్‌లో తయారీ యూనిట్లను ఏర్పాటుచేస్తామన్న గ్లోబల్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు ఫాక్స్‌కాన్, సోని ప్రకటనలు మేకిన్ ఇండియా కార్యక్రమ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బడ్జెట్‌లో పలు ప్రోత్సాహకాలు ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపింది.
వృద్ధి అవకాశాలపై ఆశావహంగా గ్లోబల్ సీఈఓలు...
కాగా.. వృద్ధి త్వరలో ఊపందుకుంటుందని మెజారిటీ గ్లోబల్ సీఈఓలు విశ్వసిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో మంచి వ్యాపార వృద్ధిని నమోదు చేస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ఉద్యోగ నియామకాలు అధికంగా ఉంటాయని 80% మంది అభిప్రాయపడ్డారు. కేపీఎంజీ ఈ మేరకు తన సర్వే నివేదికను విడుదల చేసింది. .2014కన్నా 2015లో ఫండమెంటల్స్ బాగున్నట్లు సర్వే పేర్కొంది.