సంస్కరణలు నెమ్మదిస్తాయ్: మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక సంస్కరణలు మందగించనున్నట్లు ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- మోర్టాన్ స్టాన్లీ అంచనావేస్తోంది. 2016-17 బడ్జెట్ ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నట్లు పేర్కొంది. కీలక బిల్లుల విషయంలో ప్రతిపక్షం వ్యతిరేకత, విధాన నిర్ణయాల అమల్లో బ్యూరోక్రసీ అడ్డంకులు సంస్కరణలు నెమ్మదించడానికి కారణంగా విశ్లేషించింది. దేశంలో మార్కెట్ ఒడిదుడుకులకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉందని పేర్కొంది. క్రూడ్ ధరల పతనం, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలతోపాటు కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు బాగుండకపోవడం, బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య వంటి అంశాలు సైతం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నట్లు సంస్థ తాజా నివేదిక అభిప్రాయపడింది.