న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తోంది. రేపు (గురువారం–ఈ నెల 30న) జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో రైట్స్ ఇష్యూ, డివిడెండ్, గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలపై చర్చ జరగనున్నది. ప్రస్తుత వాటాదారులకు రైట్స్ ఇష్యూ ద్వారా షేర్లు జారీ చేసే అంశం డైరెక్టర్ల బోర్డ్ పరిశీలనలో ఉంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ ఇలాంటి ఇష్యూతో రావడం ఇదే మొదటిసారి.
రూ.40,000 కోట్లు సమీకరణ...
రుణ రహిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దే లక్ష్యంలో ఇదొక అడుగు అని నిపుణులంటున్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా కనీసం 5 శాతం వాటా షేర్లను జారీ చేయొచ్చని వారంటున్నారు. అంటే ప్రతి వంద షేర్లకు 5 కొత్త షేర్లు లభిస్తాయి. ఈ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.40,000 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. గత ఏడాది డిసెంబర్ నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం రుణ భారం రూ.3,06,851 కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,53,719 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద నికర రుణ భారం రూ.1,53,132 కోట్లు.
కాగా ఇటీవలనే రిలయన్స్ జియో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో 10% వాటాను ఫేస్‌బుక్ రూ.43,574 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. ఇంధన రిటైల్ విభాగంలో సగం వాటాను రూ.7,000 కోట్లకు బీపీకి విక్రయించింది. అలాగే టెలికం టవర్ బిజినెస్‌ను రూ.25,200 కోట్లకు అమ్మేసింది. ఆయిల్ టు కెమికల్ బిజినెస్‌లో 20% వాటా ను సౌదీ ఆరామ్‌కో కంపెనీకి విక్రయించడానికి గత ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లావాదేవీలన్నింటి ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవాలని రిలయన్స్ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment