ఫ్రాన్స్‌ ఎన్నికలపై మార్కెట్‌ ఫోకస్‌ | Reliance, Wipro Earnings To Sway Markets | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌ ఎన్నికలపై మార్కెట్‌ ఫోకస్‌

Published Mon, Apr 24 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

ఫ్రాన్స్‌ ఎన్నికలపై మార్కెట్‌ ఫోకస్‌

ఫ్రాన్స్‌ ఎన్నికలపై మార్కెట్‌ ఫోకస్‌

♦ ఏప్రిల్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపుతో ఒడిదుడుకులు
♦  ప్రభావితం చేయనున్న ఆర్‌ఐఎల్, విప్రో యాక్సిస్‌ బ్యాంక్‌ల ఫలితాలు
♦ ఈసీబీ పాలసీపైనా ఇన్వెస్టర్ల దృష్టి


ముంబై: ఫ్రాన్స్‌ ఎన్నికలు, కార్పొరేట్‌ ఫలితాల ఆధారంగా ఈ వారం మార్కెట్‌ ట్రెండ్‌ వుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఏప్రిల్‌ సిరీస్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులు ఈ వారంలో(ఈ నెల 27న–గురువారం) ముగియనున్నందున స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ అంశాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు, ఫ్రాన్స్‌ ఎన్నికల.. తదితరాలు కూడా ఈ వారం మార్కెట్‌ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఇక ఈ శుక్రవారం (ఈ నెల28న) పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, విదేశీ కరెన్సీ నిల్వలు, బ్యాంక్‌ డిపాజిట్‌ వృద్ధి, బ్యాంక్‌ రుణ వృద్ధి.. ఈ అంశాలకు సంబంధించిన గణాంకాలు వెలువడుతాయి.

నేడు ఫ్రాన్స్‌ ఎన్నికల తొలి రౌండు ప్రభావం
ఇప్పుడు అందరి దృష్టి ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. యూరోజోన్‌లో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్స్‌లో రెండు రౌండ్లుగా జరిగే ఈ ఎన్నికల తుది ఫలితాలు మే 11న వస్తాయి. కానీ ఏప్రిల్‌ 23.. ఆదివారం జరిగిన తొలి రౌండు ఎన్నికలు మార్కెట్లకు కీలకమని నిపుణులు అంచనావేస్తున్నారు.

ఈ తొలి రౌండు ఫలితంతో మార్కెట్‌ ముందుగా సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రైవేట్‌ క్లయింట్‌ గ్రూప్‌ హెడ్‌ వీకే శర్మ చెప్పారు. మే 7న రెండో రౌండు ఎన్నికలు జరుగుతాయి.  అమెరికా, ఉత్తర కొరియా మధ్య తాజా పరిణామాలేవైనా సంభవిస్తే భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ ప్రభావితమవుతాయని ట్రేడ్‌ స్మార్ట్‌ ఆన్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్‌ సంఘానియా అన్నారు. ఈ వారం జరిగే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) పాలసీ సమావేశం సైతం మార్కెట్‌ ట్రెండ్‌ను శాసిస్తుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. గురువారం (27న) ఈసీబీ  ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది.

దిగ్గజ కార్పొరేట్ల ఫలితాలు...
ఈ వారంలో పలు దిగ్గజ కంపెనీల జనవరి–మార్చి క్వార్టర్‌ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటిదాకా వెలువడిన క్యూ4 ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఈ వారంలో రానున్న కంపెనీల ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తున్నారు. సోమవారం(ఈనెల 24న) మార్కెట్‌ ముగిసిన తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్యూ4 ఫలితాలు వస్తాయి.

అదే రోజు అల్ట్రాటెక్‌ సిమెంట్‌  ఫలితాలు వెల్లడి కానున్నాయి. మంగళవారం(ఈ నెల 25న) యాక్సిస్‌ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ ప్రులైఫ్, బుధవారం(ఈ నెల 26న) జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్, గురువారం(ఈ నెల27) మారుతీ సుజుకీ, బయోకాన్, కోటక్‌  మహీంద్రా బ్యాంక్, శుక్రవారం(ఈ నెల28) అంబుజా సిమెంట్, ఫెడరల్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ తదితర కంపెనీల ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.18,890 కోట్లు
దేశీయ కేపిటల్‌ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.18,890 కోట్లను ఎఫ్‌పీఐలు  నికరంగా పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్‌ 3–21 తేదీల మధ్య ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.1,132 కోట్లుగాను, డెట్‌ విభాగంలో రూ.17,758 కోట్లుగానూ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement