న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు సంబంధించి సవరించిన కేవైసీ నిబంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం విడుదల చేసింది. ఎన్‌ఆర్‌ఐలు, దేశీయంగా నివసించే పౌరులు ఎఫ్‌పీఏల్లో అనియంత్రిత వాటా కలిగి ఉండేందుకు సెబీ తాజాగా అనుమతించింది. కేవైసీ (మీ కస్టర్ ఎవరన్నది తెలుసుకోవడం)కి సంబంధించి రెండు సర్క్యులర్‌లను విడుదల చేసింది.
గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలపై ఎఫ్‌పీఏల్లో ఆందోళన తలెత్తడం, నిబంధనల పాటింపు విషయంలో గందరగోళం కారణంగా రూ.4 లక్షల కోట్ల మేర ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. వీటికి పరిష్కారంగా ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ అధ్యక్షతన గల ప్యానల్ పలు సవరణలను సూచించింది. ఈ మేరకు సెబీ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొత్త నిబంధనలు
ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు (విదేశాల్లోని భారత పౌరులు), ఆర్‌ఐ (భారత్‌లో నివాసం ఉండేవారు)లు ఎఫ్‌పీఐల్లో అనియంత్రింత వాటా కలిగి ఉండొచ్చు. ఒక్కరే అయితే 25 శాతం, ఎన్‌ఆర్‌ఐ/ఓసీఐ/ఆర్‌ఐ మొత్తం హోల్డింగ్స్ కలిపి ఓ ఎఫ్‌పీఐ ఆధ్వర్యంలోని ఆస్తుల్లో 50 శాతం మించకూడదు. వీరిని భాగస్వాములుగానూ అనుమతిస్తారు. ఎఫ్‌పీఐలను ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ (ఐఎం) నియంత్రించొచ్చు.
ఈ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ ఎన్‌ఆర్‌ఐ లేదా ఓసీఐ లేదా ఆర్‌ఐ అయినా కావచ్చు. లేదా వీరి నియంత్రణలో అయినా ఉండొచ్చు. ఇలాంటి సవరణలు, వెసులుబాట్లు నూతన నిబంధనల్లో ఉన్నాయి. వీటిని పాటించేందుకు ఎఫ్‌పీఐలకు ఆరు నెలల సమయం ఇవ్వగా, నిబంధనలు పాటించని వారు తమ పొజిషన్లను మూసివేసేందుకు మరో 180 రోజుల గడువు ఇచ్చింది. కేటిగిరీ–2, 3 పరిధిలోని ఎఫ్‌పీఐలు తమ నిర్వహణలోని ఆస్తుల లబ్దిదారులతో జాబితాను నిర్వహించాలి. ఈ వివరాలను సెబీకి కూడా సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment