
రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం కంటే అత్యధికంగా నవంబర్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 4.88 శాతానికి పెరిగినట్టు వెల్లడైంది. అక్టోబర్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.58 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. ఆహార ధరలు పెరుగుతుండటంతో రిటైల్ ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందనే భయాందోళనతోనే ఇటీవల జరిగిన పాలసీ సమీక్షలో కూడా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను తగ్గించలేదు. రాయిటర్స్ అంచనాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరుగుతుందని అంచనావేశారు. కానీ అత్యధిక మొత్తంలో వర్షాల కారణంగా ఆహార ధరలు పైకి ఎగిశాయి.
పండ్లు, కూరగాయల తోటలకు నవంబర్ నెలలో కురిసిన వర్షాలు తీవ్ర స్థాయిలో దెబ్బకొట్టాయని ఆర్థికవేత్తలు చెప్పారు. ఉల్లిపాయలు, టోమాటోలు, ఇతర పాడయ్యే ఉత్పత్తుల ధరలు పెరిగినట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 6న జరిగిన పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ తన ద్రవ్యోల్బణ అంచనాలను 10 బేసిస్ పాయింట్లు పెంచి 4.3 శాతం నుంచి 4.7 శాతం మధ్యలో ఉండనున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు తెలిపింది. 2018 చివరి వరకు కూడా ఆర్‌బీఐ వడ్డీరేట్లను మార్చదని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అక్టోబర్‌లో 2.2 శాతానికి క్షీణించింది. సెప్టెంబర్‌లో ఇది 3.8 శాతంగా ఉండేది. కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి కొంత ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే.