
రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘హిమాలయన్’ బైక్
ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా ‘హిమాలయన్’ పేరిట 411 సీసీ ఆల్ టెరెయిన్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా ‘హిమాలయన్’ పేరిట 411 సీసీ ఆల్ టెరెయిన్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. ఐషర్ మోటార్స్‌లో భాగమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం బులెట్, క్లాసిక్, థండర్‌బర్డ్, కాంటినెంటల్ జీటీ తదితర బైక్‌లను విక్రయిస్తోంది. హిమాలయన్ రూపకల్పనపై దాదాపు అయిదేళ్ల నుంచి కసరత్తు చేస్తున్నట్లు, వివిధ ప్రాంతాల్లో దీన్ని పరీక్షించినట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. ఇందులో 24.5 బీహెచ్‌పీ ఇంజిన్, అయిదు గేర్లు తదితర ఫీచర్లు ఉంటాయి. వచ్చే నెల మధ్యలో హిమాలయన్ విక్రయాలు ప్రారంభం కాగలవని లాల్ వివరించారు. కొత్తగా 250 సీసీ-750 సీసీ మధ్య సామర్థ్యం గల వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.