ఈ ఏడాది 78 స్థాయికి రూపాయి! | Rupee up to 78 level this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 78 స్థాయికి రూపాయి!

Published Thu, Feb 7 2019 4:45 AM | Last Updated on Thu, Feb 7 2019 4:45 AM

Rupee up to 78 level this year - Sakshi

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది 78 స్థాయిని చూసే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ కార్వీ తెలియజేసింది. ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌ లోటులు దీనికి ప్రధాన కారణం కానున్నాయని సంస్థ తన వార్షిక కమోడిటీ, కరెన్సీ నివేదికలో పేర్కొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు సైతం ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా కార్వీ కమోడిటీస్‌ అండ్‌ కరెన్సీల విభాగం సీఈఓ రమేశ్‌ వరకేద్కర్‌ తెలిపారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► 68– 69.50 శ్రేణి బేస్‌గా 73.70– 74.50 శ్రేణి కనిష్ట స్థాయికి రూపాయి చేరవచ్చు. ఈ స్థాయి కిందకు పడితే, ఖచ్చితంగా ఇదే ఏడాది రూపాయి 78 దిశగా పతనం అయ్యే అవకాశం ఉంది.
► ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితంపై తీవ్ర అనిశ్చితి ఉంటుంది. అందువల్ల అటు విదేశీ వ్యవస్థాగత ఇన్వెస్టర్లు ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులకు తక్షణం దూరంగా ఉండే వీలుంది.  
► 2017–18  పూర్థి ఆర్థిక సంవత్సరంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 48.72 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచే నాటికే ఈ విలువ 34.94 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇదే విధంగా రెండవ ఆరునెలల గణాంకాలూ నమోదయితే, క్యాడ్‌ దేశానికి తీవ్ర భారంగా తయారయ్యే అవకాశం ఉంది.  
► ఒపెక్, రష్యాలు తమ ఉత్పత్తుల కోత నిర్ణయం తీసుకుంటే, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.  
► వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయంగా వృద్ధి భయాల వల్ల కాపర్, అల్యూమినియంసహా బేస్‌మెటల్‌ ధరలు బలహీనంగానే ఉంటాయి.  
► సరఫరాల సమస్యల వల్ల పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది.  
► అధిక పంట దిగుబడుల వల్ల సొయాబీన్‌ మార్కెట్‌లో ఈ ఏడాది రెండవ భాగంలో అమ్మకాలు ఒత్తిడి ఉండే వీలుంది.
► తక్కువ దిగుబడివల్ల జీర, చిక్కుడు ధరలు  సానుకూలంగా ఉండవచ్చు.


71.56 వద్ద రూపాయి...
డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం కేవలం ఒక్కపైసా లాభంతో 71.56 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 71.68–71.49 శ్రేణిలో తిరిగింది.  అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి  క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 10 డాలర్లకుపైగా పెరగడంతో రూపాయి జారుడు బల్లమీదకు ఎక్కింది. ఇప్పటికిప్పుడు రూపాయి 68 దిశగా బలపడే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement