సహారా ఆస్తుల్లోమరికొన్ని వేలానికి..
♦ 42కు చేరిన మొత్తం స్థలాల సంఖ్య
♦ రిజర్వ్ ధర రూ.4,345 కోట్లు
♦ జాబితాలో ఇంకా 20 భూములు...
న్యూఢిల్లీ: వేలం ప్రక్రియకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ జాబితాలో మరో పదహారు సహారా ఆస్తులు చేరాయి. వీటి బిడ్ ధరను రూ.1,245 కోట్లుగా నిర్ణయించింది. దీనితో వేలానికి సిద్ధమయిన మొత్తం భూముల సంఖ్య 42కు చేరింది. వీటి మొత్తం రిజర్వ్ ధర రూ.4,345 కోట్లకు చేరింది. రానున్న రోజుల్లో ఇంతే విలువైన ఆస్తులు వేలం జాబితాలో చేరే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. సెబీ గురువారం రెండు వేర్వేరు నోటీసులు విడుదల చేస్తూ... జూలై 20వ తేదీన రూ.666 కోట్ల రిజర్వ్ ధరతో ఎస్‌బీఐ క్యాప్స్ ఎనిమిది ఆస్తుల ఈ-వేలం నిర్వహిస్తుందని పేర్కొంది. రూ.579 కోట్ల విలువైన మరో ఎనిమిది ఆస్తులను జూలై 18న హెచ్‌డీఎఫ్‌సీ ఈ-వేలం వేస్తుందని పేర్కొంది. జూలై 7, జూలై 13వ తేదీల్లో ఎస్‌బీఐ క్యాప్స్ మరికొన్ని భూములను ఈ ఆక్షన్ నిర్వహిస్తుండగా, జూలై 4, జూలై 15 తేదీల్లో హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ కొన్ని భూములకు వేలం నిర్వహించనున్నాయి. ఇరు సంస్థలు సమానంగా మొత్తం 26 ఆస్తులకు ఈ వేలం నిర్వహించనున్నాయి. రిజర్వ్ ధర రూ.3,100 కోట్లు.
తరువాత మిగిలిన ఆస్తుల వేలం...
31 ల్యాండ్ పార్శిళ్లను రూ.2,400 కోట్లకు విక్రయించడానికి హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీకి సెబీ అనుమతి ఉంది. ఇక ఎస్‌బీఐ క్యాప్ విషయంలో 30 ల్యాండ్ ప్రొపర్టీల అమ్మకాలకు అనుమతి ఉంది. దేశ వ్యాప్తంగా ఈ ఆస్తులు ఉన్నాయి. మిగిలిన ఆస్తుల ఈ- విక్రయానికి మరోసారి నోటీసులు వెలువడనున్నాయి. ఈ కేసులో రెండేళ్ల పాటు తీహార్ జైలులో ఉన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు.