సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు సంక్షోభం డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేను చుట్టుకుంది. ఆర్థిక సంక్షోభం, ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫోన్‌పే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అటు యస్ బ్యాంకు ఖాతాదారుల్లోను, ఫోన్ పే యూజర్లలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై ఫోన్ పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. దీర్ఘకాలిక అంతరాయానికి చింతిస్తున్నామన్నారు. తమ బ్యాంకింగ్ భాగస్వామి యస్ బ్యాంకుపై ప్రభుత్వం తాత్కాలిక నిషేదం విధించడంతో ఫోన్ పే సేవలు ప్రభావితమయ్యాయని వివరించారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ సమ్యను పరిష్కరిస్తామని ఆయన తన కస్టమర్లకు హామీ ఇచ్చారు.
తాత్కాలిక నిషేధ నిబంధనల ప్రకారం కరెంట్ అకౌంట్లతో కలుపుకొని ఖాతాదారులంతా కూడా ఏప్రిల్ 3 దాకా రూ. 50 వేలకు మించి నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్‌బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో యస్ బ్యాంకు భారీ నష్టాలను మూటగట్టుకుంది. దాదాపు 89 శాతం కుప్పకూలి ఆల్ టైం కనిష్టానికి చేరింది. (చదవండి: ఓ మై గాడ్... వెంకన్నే రక్షించాడు!)
కాగా రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు యస్ బ్యాంక్‌ను ఎల్‌ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్‌బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్‌పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment