సాక్షి, న్యూఢిల్లీ : ఏటీఎంలలో నగదు రాక, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్ల ద్వారా రోజుకు రూ.2000 వరకు నగదును కస్టమర్లు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. ‘క్యాష్@పీఓఎస్’ కార్యక్రమం ద్వారా ఈ క్యాష్ విత్‌డ్రా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. ఏటీఎంల వద్ద నగదు దొరకని కస్టమర్లకు ఇది గుడ్‌న్యూస్‌గా మారింది. ‘క్యాష్@పీఓఎస్’ సౌకర్యం ద్వారా డెబిట్ కార్డుదారులు ఎస్‌బీఐ పీఓఎస్ టర్మినల్స్ వద్ద డెబిట్/ప్రీపెయిడ్ కార్డులను స్వైప్ చేసి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని ఎస్‌బీఐ ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం టైర్ 1, టైర్ 2 నగరాల ప్రజలు ఒక్కో కార్డుపై రూ.1000 విత్‌డ్రా చేసుకోవచ్చని, టైర్ 3 నుంచి టైర్ 6 నగరాల ప్రజలు రూ.2000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిసింది.
మెర్చంట్ లొకేషన్ల వద్ద ఎస్‌బీఏ ఏర్పాటు చేసిన పీఓఎస్ మిషన్ల నుంచి ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల డెబిట్ కార్డు కస్టమర్లు ఈ విత్‌డ్రాను చేపట్టుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ విత్‌డ్రాలకు ఎటువంటి ఛార్జీలను విధించడం లేదని కూడా ఎస్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఈ ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ద్వారా రిటైల్ వ్యాపారుల వద్ద కార్డు పేమెంట్లను జరుపుకోవచ్చు. ఎస్‌బీఐకి ప్రస్తుతం 6.08 లక్షల పీఓఎస్ మిషన్లు ఉన్నాయి. వాటిలో 4.78 లక్షల మిషన్లను నగదును అందిస్తున్నాయి. కాగ, దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏర్పడటంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత 24 గంటల నుంచి నగదును అందుబాటులోకి తీసుకురావడానికి తమ ఏటీఎం నెట్‌వర్క్‌లను మెరుగుపరుస్తున్నట్టు ఎస్‌బీఐ చెప్పింది. రేపటి వరకు ఈ సమస్య మటుమాయమవుతుందని కూడా ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment