మెగా ఎస్‌బీఐకి తొలి అడుగు! | SBI begins working on framework for merger of subsidiaries | Sakshi
Sakshi News home page

మెగా ఎస్‌బీఐకి తొలి అడుగు!

Published Mon, Jun 13 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

మెగా ఎస్‌బీఐకి తొలి అడుగు!

మెగా ఎస్‌బీఐకి తొలి అడుగు!

* అనుబంధ బ్యాంకుల విలీనానికి ఎస్‌బీఐ కసరత్తు షురూ
* కార్యాచరణ కోసం 15-20 మంది సభ్యులతో బృందం
* 3-4 నెలల్లో విలీన ప్రక్రియ మొదలు..!

ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రతిపాదిత విలీనంపై కొన్ని రాజకీయ పక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం..

ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర రావాల్సి ఉన్నప్పటికీ ఎస్‌బీఐ మాత్రం ఈ దిశగా చర్యలు ప్రారంభించడం గమనార్హం. అయిదు అనుబంధ బ్యాంకుల విలీనానికి సంబంధించి కార్యాచరణను సిద్ధం చేయడం కోసం 15-20 మంది అధికారులతో ఒక బృందాన్ని ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది. జనరల్ మేనేజర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తున్నారని..

ఇందులో ఇంకొందరు డిప్యూటీ జనరల్ మేనేజర్లు కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అసోసియేట్ అండ్ సబ్సిడరీస్ విభాగం ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనుంది. ఈ విభాగం బ్యాంక్ ఎండీ వి.జి కన్నన్ నేతృత్వంలో పనిచేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 3-4 నెలల్లో విలీన ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.
 
కేబినెట్ ఆమోదమే తరువాయి...
భారతీయ మహిళా బ్యాంకుతో పాటు ఐదు అనుబంధ బ్యాంకులను(స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, హైదరాబాద్, మైసూర్, ట్రావన్‌కోర్, పాటియాలా) విలీనం చేసుకునే ప్రతిపాదనను ఎస్‌బీఐ డెరైక్టర్ల బోర్డు గత నెలలో ఆమోదించడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పించిన సంగతి తెలిసిందే.

అన్ని అనుబంధ బ్యాంకులను ఒకేసారి విలీనం చేసుకోవాలనేది ఎస్‌బీఐ యోచన. ఇవన్నీ టెక్నాలజీ పరంగా ఒకే ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తున్న నేపథ్యంలో విలీనానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, విలీన ప్రతిపాదనను ప్రభుత్వం మదింపు చేస్తోందని.. త్వరలోనే దీనిపై తాము నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే పేర్కొన్న విషయం విదితమే. త్వరలోనే కేబినెట్ ఆమోదం ఉండొచ్చని... విలీనాలను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ విధానమని కూడా ఆయన చెప్పడం గమనార్హం. ఇప్పుడున్న అయిదు అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావెన్‌కోర్‌లు స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్నాయి.

రాజకీయ పార్టీలు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత...
కాగా, ఎస్‌బీఐ ఈ ప్రతిపాదనను ప్రకటించిన వెంటనే దీనికి వ్యతిరేకంగా అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు గత నెల 20న దేశవ్యాప్త సమ్మె కూడా చేశారు.

ఈ నెల 28న, జూలై 29న కూడా సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. కేరళలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్(ఎస్‌బీటీ) విలీనాన్ని వ్యతిరేకిస్తోంది.

ఈ విలీన ప్రతి పాదనలపై తొలిసారి నిరసన గళం విప్పిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే. ‘తమ ప్రజలు ఎస్‌బీటీని కేరళ బ్యాంకుగానే చూస్తున్నారు. ప్రభుత్వానిది కూడా ఇదే అభిప్రాయం. అందుకే దీన్ని విలీనం చేయకుండా విడిగానే కొనసాగించాలి’ అని ఆ రాష్ట్ర కొత్త సీఎం పి. విజయన్ తాజాగా వ్యాఖ్యానించారు.

ప్రపంచస్థాయి బ్యాంక్ ఆవిర్భావం!
విలీనం పూర్తయితే ప్రపంచస్థాయి బడా బ్యాంకులతో పోటీపడేవిధంగా మెగా ఎస్‌బీఐగా ఆవిర్భవిస్తుంది. దీని ఆస్తుల(బ్యాలెన్స్ షీట్ పరిమాణం) విలువ 555 బిలియన్ డాలర్లకుపైగానే(దాదాపు రూ.37 లక్షల కోట్లు) ఉంటుంది. ఇక అనుబంధ బ్యాంకులన్నింటినీ కలిపి చూస్తే... గతేడాది డిసెంబర్ నాటికి ఎస్‌బీఐకి 22,500 శాఖలు, 58,000 ఏటీఎంలు ఉన్నాయి.

ఇందులో ఎస్‌బీఐ ఒక్కదానికే 16,500 శాఖలు(36 దేశాల్లో 198 విదేశీ కార్యాలయాలు సహా) ఉన్నాయి. తొలిసారిగా ఎస్‌బీఐ తన అనుబంధ బ్యాంకుల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను 2008లో విలీనం చేసుకుంది. ఆతర్వాత రెండేళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌ను కూడా కలిపేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement