
త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపు
♦ ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
♦ ద్రవ్యోల్బణం దిగివస్తుందని వెల్లడి
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రేట్ల కోత ప్రయోజనాన్ని తాము ఎప్పటికప్పుడు రుణ గ్రహీతలకు అందిస్తూనే ఉన్నామని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. సమీప కాలంలోనే బ్యాంకు లెండింగ్ రేటు తగ్గించనున్నట్టు ఆమె వెల్లడించారు. దీని వల్ల ఆటో, గృహ రుణాలు తీసుకున్న వారికి లబ్ధి కలుగుతుందన్నారు. 2015 జనవరి నుంచి ఆర్‌బీఐ 1.75 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించగా తాము ఇప్పటి వరకు 0.95 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గింపు ప్రయోజనాలను రుణ గ్రహీతలకు బదలాయించామని భట్టాచార్య పేర్కొన్నారు. త్వరలోనే రేట్లను సవరించడం ద్వారా మరింత ప్రయోజనాన్ని బదలాయించనున్నట్టు ఓ టెలివిజన్ చానల్‌కు చెప్పారు. ఆర్‌బీఐ ఇటీవల రెపో, రివర్స్ రెపో రేట్లను 0.25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే.
అయితే, ఎస్‌బీఐ ఒకేసారి భారీగా 0.25 స్థాయిలో రేట్లను తగ్గించడం కాకుండా ఒక బ్యాంకుగా క్రమానుగతంగా నెలనెలా ఆ ప్రయోజనాన్ని బదలాయిస్తామన్నారు. ద్రవ్యోల్బణం దిగి వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ‘ద్రవ్యోల్బణం దిగివస్తుందని మా అంతర్గత పరిశోధనలో తెలిసింది. ద్రవ్యోల్బణం తగ్గితే ఆర్‌బీఐ నుంచి మరోసారి రేట్ల కోత తప్పకుండా ఉంటుంది’ అని అన్నారు. తక్కువ వడ్డీ రేట్ల వల్ల అటు బడా కార్పొరేట్ సంస్థలు, ఇటు చిన్న వ్యాపార సంస్థలకు సమానంగా ప్రయోజనం చేకూరుతుందని, ఎందుకంటే ఇరు వర్గాలు సప్లయ్ చైన్‌లో భాగమేనని భట్టాచార్య వివరించారు.