సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి మరోషాక్ తగిలింది. ఆర్‌కాం ఎరిక్‌సన్ వివాదంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై మంగళవారం సుప్రీంకోర్టు ఆర్‌కామ్‌కు గట్టి ఆదేశాలిచ్చింది. చెల్లింపుల ఆలస్యంపై జస్టిస్ రోహిన్టన్ ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్‌కాంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువును మరోసారి పెంచిన ధర్మాసనం ఇదే చివరిసారి పొడిగింపు అని స్పష్టంగా చెప్పింది. అంతేకాదు ఆలస్యమైతే సంవత్సరానికి 12శాతం వడ్డీ చెల్లించాలని కూడా తేల్చి చెప్పింది.
సెప్టెంబర్ 30లోపు రూ.550 కోట్లను చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో ఎరిక్‌సన్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. డిసెంబర్ 15లోపు స్వీడన్ కంపెనీ ఎరిక్సన్‌కు రూ.550 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఒకసారి గడువును పొడిగించిన సుప్రీం..ఇకపై గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment