
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ శ్రీరామ్ ప్రొపర్టీస్ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ పచ్చజెండా ఊపింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,250 కోట్లు సమీకరిస్తుందని అంచనాలున్నాయి. ఈ విలువ పరంగా చూస్తే, ఈ కంపెనీ విలువ రూ.3,750 కోట్లని అంచనా. ఐపీఓ పత్రాలను గత ఏడాది డిసెంబర్‌లో సమర్పించిన ఈ కంపెనీ ఈ నెల 9న సెబీ నుంచి ఆమోదం పొందింది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో భాగంగా ప్రస్తుత వాటాదారులు (టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్, టీపీజీ ఏషియా) 4.24 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. మరోవైపు ప్రి–ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.100 కోట్లు సమీకరించాలని కూడా కంపెనీ భావిస్తోంది. ఈ ఐపీఓ నిధులను రుణాలను తగ్గించుకోవడానికి, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, ఎడెల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జేఎమ్ ఫైనాన్షియల్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తాయి. శ్రీరామ్ గ్రూప్‌నకు చెందిన శ్రీరామ్ ప్రొపర్టీస్ కంపెనీ దక్షిణ భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రియల్టీ కంపెనీ. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, విశాఖపట్నం నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మిడ్–మార్కెట్, అందుబాటు ధరల గృహ కేటగిరీలపై ఈ కంపెనీ ప్రధానంగా దృష్టిసారిస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ 12 కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment