ఎఫ్‌టీఐఎల్‌కు సెబీ షాక్!
ముంబై: మూడు నెలల్లోగా స్టాక్ ఎక్స్ఛేంజీల బిజినెస్ నుంచి వైదొలగాల్సిందిగా ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్‌టీఐఎల్)కు సెబీ ఆదేశాలు జారీ చేసింది.జిగ్నేష్ షాకు చెందిన ఎఫ్‌టీఐఎల్ గ్రూప్‌నకు ఏరకమైన స్టాక్ ఎక్స్ఛేంజీల నిర్వహణ లేదా వాటాలను కలిగి ఉండేందుకు అర్హత లేదని సెబీ తాజాగా స్పష్టం చేసింది. వెరసి గడువులోగా ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్) సహా మరో నాలుగు ఎక్స్ఛేంజీలలో గల వాటాలను ఎఫ్‌టీఐఎల్ విక్రయించాల్సి ఉంటుంది.
ఎన్‌ఎస్‌ఈ, ఢిల్లీ స్టాక్ ఎక్స్ఛేంజీ, వడోదర స్టాక్ ఎక్స్ఛేంజీ, ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్ క్లియరింగ్ కార్పొరేషన్‌లలో ఎఫ్‌టీఐఎల్ గ్రూప్ వాటాలను కలిగి ఉంది. మరోవైపు వీటిలో ఎఫ్‌టీఐఎల్, తదితర సంస్థల ద్వారా ఈక్విటీలు, లేదా వోటింగ్ హక్కులు కలిగిన ఇతర సాధనాలవల్ల లభించే వోటింగ్ హక్కులను వినియోగించుకోవడాన్ని సెబీ నిషేధించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ చెల్లింపుల సంక్షోభం కారణంగా ఎఫ్‌టీఐఎల్ గ్రూప్ పలు సమస్యల్లో చిక్కుకున్న నేపథ్యంలో సెబీ ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
కేవైసీ నిబంధనలు సరళతరం
ఇన్వెస్టర్లు కొత్త బ్రోకింగ్ ఏజెన్సీకి లేదా ఫండ్‌కి మారిన ప్రతిసారి తమ వివరాలన్నింటినీ సమర్పించాల్సిన అవసరం లేకుండా కేవైసీ (కస్టమర్ల వివరాల) నిబంధనలను సెబీ సడలించింది. కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇక ఇన్వెస్టర్లు తొలుత ఇచ్చే వివరాలను కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్‌ఏ) వ్యవస్థలో నిక్షిప్తమవుతాయి. ఆ తర్వాత వేరే బ్రోకింగ్ ఏజెన్సీకి మారినా కస్టమరు ప్రత్యేకంగా కేవైసీ వివరాలన్నీ ఇవ్వనక్కర్లేదు. సదరు బ్రోకింగ్ ఏజెన్సీ క్లయింటు వివరాలన్నింటినీ మళ్లీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. కేఆర్‌ఏ వ్యవస్థ నుంచి సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.