మరో 149 పాయింట్లు డౌన్
వరుసగా రెండో రోజూ మార్కెట్లు నష్టపోయాయి. గత నెల రోజుల్లోలేని విధంగా సెన్సెక్స్ 149 పాయింట్లు క్షీణించి 22,359 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 42 పాయింట్లు తగ్గి 6,694 వద్ద స్థిరపడింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపడుతుండటంతో సెంటిమెంట్ బలహీనపడుతున్నదని నిపుణులు తెలిపారు. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 42, నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోవడంతో పది రోజుల మార్కెట్ ర్యాలీకి తొలిసారి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
శుక్రవారం ట్రేడింగ్‌లో దేశీ సంస్థల భారీ అమ్మకాలు కూడా మార్కెట్లను పడగొట్టాయి. ఎఫ్‌ఐఐలు రూ. 232 కోట్లు ఇన్వెస్ట్‌చేసినప్పటికీ, దేశీ ఫండ్స్ రూ. 1,125 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. అంతర్గత సమస్యల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొనడం కూడా ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. కాగా, సెన్సెక్స్ గరిష్టంగా 22,522, కనిష్టంగా 22,339 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
హెచ్‌డీఐఎల్ హైజంప్
బీఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ఐటీ రంగాలు 1% డీలాపడగా, రియల్టీ ఇండెక్స్ 3.4% ఎగసింది. మార్కెట్లకు విరుద్ధమైన రీతిలో రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్ 16%పైగా దూసుకెళ్లగా, కోల్టేపాటిల్, ఇండియాబుల్స్, యూనిటెక్, డీబీ, ప్రెస్జీజ్, డీఎల్‌ఎఫ్, అనంత్‌రాజ్ 10-2.5% మధ్య జంప్‌చేయడం విశేషం.
ఆ ఐదు మినహా
సెన్సెక్స్-30లో ఐదు షేర్లు మినహా మిగిలినవన్నీ నీర సించడం గమనార్హం. సిప్లా 2% పుంజుకోగా, టాటా స్టీల్, ఎస్‌బీఐ, హిందాల్కో, కోల్ ఇండియా 0.5% స్థాయిలో బలపడ్డాయి. అయితే మరోవైపు భెల్, ఎన్‌టీపీసీ, భారతీ, టాటా మోటార్స్, గెయిల్, విప్రో, టీసీఎస్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ తదితర దిగ్గజాలు 2-1% మధ్య నష్టపోవడంతో మార్కెట్లు నీరసించాయి. కాగా, మిడ్ క్యాప్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి కొనసాగింది. దీంతో ట్రేడైన షేర్లలో 1,648 లాభపడితే, కేవలం 1,135 నష్టపోయాయి. చిన్న షేర్లలో వీనస్ రెమిడీస్ 20% దూసుకెళ్లగా, ఎంఎంటీసీ, సుజ్లాన్, బీఈఎంఎల్, బజాజ్ హిందుస్తాన్, ఎల్డర్ ఫార్మా, యూఫ్లెక్స్, ఎస్‌టీసీ తదితరాలు 11-8% మధ్య జంప్‌చేశాయి.
ఈటీఎఫ్ లిస్టింగ్ జోరు
ప్రభుత్వ సంస్థల వాటాలతో కూర్చిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ లిస్టింగ్ తొలిరోజు జోరు చూపింది. ఇష్యూ ధర రూ. 17.45కాగా, 11% ఎగసి రూ. 19.40 వద్ద ముగిసింది. 8 కోట్ల షేర్లకుపైగా లావాదేవీలు జరిగాయి. ఓఎన్‌జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఆర్‌ఈసీ, కంటెయినర్ కార్పొరేషన్ తదితర పది పీఎస్‌యూ షేర్లతో ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.