కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీలు | Sensex hit record high of 40268; Nifty peak of 12089 on rate cut hopes | Sakshi
Sakshi News home page

కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీలు

Published Tue, Jun 4 2019 5:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:09 AM

Sensex hit record high of 40268; Nifty peak of 12089 on rate cut hopes - Sakshi

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. మే నెల వాహన విక్రయాలు నిరాశపరిచాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య మన స్టాక్‌ మార్కెట్‌ కూడా పడిపోవాలి. కానీ దీనికి భిన్నంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది.

అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువెత్తింది. కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించగలదన్న అంచనాలకు సంస్కరణలు కొనసాగుతాయనే ఆశలు కూడా జత కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను నెలకొల్పాయి. సెన్సెక్స్‌ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లపైకి ఎగబాకాయి. ప్రపంచ మార్కెట్లు నష్టపోయినా, ముడి చమురు ధరలు భారీగా పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, రూపాయి బలపడటం సానుకూల ప్రభావం చూపించాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 553 పాయింట్ల లాభంతో 40,268 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 166 పాయింట్లు పెరిగి 12,089 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 40 వేల పాయింట్ల ఎగువున ముగియడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,309 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,103 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.  

మార్కెట్‌ పరుగు సంబరాల్లో బీఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ తదితరులు

రూ.1.76 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.76 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1,76,402 కోట్ల నుంచి రూ.1,56,14,417 కోట్లకు ఎగసింది.

లాభాలు ఎందుకంటే..!
1. రేట్ల కోత అంచనాలు
గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి, 5.8 శాతానికి చేరిందని కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్‌ఓ) శుక్రవారం వెల్లడించింది. మార్చి క్వార్టర్‌లో జీడీపీ తగ్గడంతో ఈ వారంలో జరిగే మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)సమావేశంలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలం పుంజుకున్నాయి. దీంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయని నిపుణులంటున్నారు.   

2. ప్యాకేజీ, సంస్కరణలపై ఆశలు....
గత క్యూ4 జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి పడిపోవడంతో వినియోగం జోరును పెంచే సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తెస్తుందనే ఆశలు పెరిగాయి. శుక్రవారం జరిగిన తొలి కేబినెట్‌ భేటీలో రైతులు, చిన్న వ్యాపారులకు కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవడం కలిసి వచ్చింది.

3. భారీగా చమురు ధరల పతనం  
ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నుంచి చూస్తే, ముడి చమురు ధరలు 15 శాతం మేర పతనమయ్యాయి. గత శుక్రవారం నాడే 2 శాతం క్షీణించగా, సోమవారం 1 శాతం పతనమయ్యాయి.

4. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు  
గత నెల మొదటి మూడు వారాల వరకూ నికర అమ్మకందారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు ఎన్నికల ఫలితాల కారణంగా నికర కొనుగోలుదారులుగా మారారు. మొత్తం మే నెలలో రూ.9,031 కోట్లు నికర పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఒక్క సోమవారం రోజే  రూ.3,069 కోట్ల మేర మ న స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం విశేషం.  

5. పుంజుకున్న రూపాయి  
డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు పుంజుకుని 69.26కు చేరింది.

6. జూన్‌ రోల్‌ ఓవర్ల జోరు
జూన్‌ సిరీస్‌ నిఫ్టీ ఫ్యూచర్స్‌ రోల్‌ ఓవర్స్‌ 72 శాతంగా ఉన్నాయి. ఈ రోల్‌ ఓవర్స్‌ మూడు నెలల సగటు 69 శాతమే. మూడు నెలల సగటు కన్నా అధికంగా ఉండటం మార్కెట్‌ షార్ట్‌టర్మ్‌ ట్రెండింగ్‌ పీరియడ్‌లోకి ప్రవేశించడాన్ని సూచిస్తోందని టెక్నికల్‌ ఎనలిస్ట్‌లు అంటున్నారు.

7. హెవీ వెయిట్స్‌ ర్యాలీ
సూచీలో హెవీ వెయిట్స్‌ను చూస్తే, సెన్సెక్స్‌ మొత్తం 553 పాయంట్ల లాభంలో ఒక్క రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాయే 91 పాయింట్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ వాటా 76 పాయింట్లుగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటా 63 పాయింట్లుగా, టీసీఎస్‌ వాటా 45 పాయింట్లు, హెచ్‌యూఎల్‌ వాటా 36 పాయింట్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఐదు షేర్ల వాటాయే  311 పాయింట్లుగా ఉంది.


మరిన్ని విశేషాలు...
► 31 సెన్సెక్స్‌ షేర్లలో మూడు షేర్లు –ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐటీసీలు నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి.

► బీఎస్‌ఈలో 19 రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.  

► నిఫ్టీ 50లో 44 షేర్లు లాభపడగా, ఆరు షేర్లు నష్టపోయాయి.  

► మే నెలలో వాహన విక్రయాలు 13 శాతం పెరగడంతో హీరో మోటొకార్ప్‌ షేర్‌ 6 శాతం లాభంతో రూ.2,843  వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  

► గత వారం ముడి చమురు ధరలు బాగా పతనం కావడంతో పెయింట్, ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, టైర్, విమానయాన సంస్థల షేర్లు లాభపడ్డాయి.  

► విమానయాన ఇంధనం ధరలు తగ్గడంతో విమానయాన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హై, రూ.157ను తాకిన స్పైస్‌జెట్‌ చివరకు 4 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది.

► నికర లాభం దాదాపు రెట్టింపు కావడంతో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 10 శాతం పెరిగి రూ.1,360 వద్ద ముగిసింది.  

► గత క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతోఅదానీ గ్యాస్‌సహా గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి.

► స్టాక్‌ మార్కెట్‌ దుమ్మురేపుతున్నా, హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్‌ సోమవారం 5 శాతం పతనమై, 30 నెలల కనిష్ట స్థాయి, రూ.388ని తాకింది. చివరకు 5.3 శాతం నష్టంతో రూ.391 వద్ద ముగిసింది. కంపెనీ ప్రమోటరైన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలవడంతో గత ఏడు రోజుల్లో ఈ షేర్‌ 20 శాతం మేర పతనమైంది.

► ముడి చమురు ధరలు తగ్గడం, రేట్ల కోత అంచనాలు బలం పుంజుకోవడంతో ప్రభుత్వ బాండ్ల రాబడులు పడిపోయాయి. పదేళ్ల బాండ్ల రాబడులు 6.998 శాతానికి చేరాయి. 2017, నవంబర్‌ తర్వాత బాండ్ల రాబడులు 7 శాతం దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి.  

► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటే ఇంట్రాడేలో పలు షేర్లు ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ గ్యాస్, గుజరాత్‌ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement