రైలు, విమాన షేర్ల జోరు
ప్రధాని మోదీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సురేష్ ప్రభుకు రైల్వే శాఖ దక్కడంతో రైల్ షేర్లు పరుగందుకున్నాయి. టక్స్‌మాకో రైల్ 9%, కాళిందీ నిర్మాణ్ 8%, బీఈఎంఎల్, నెల్కో 7%, కెర్నెక్స్ మైక్రో 5%, టిటాగఢ్ 4%, స్టోన్ ఇండియా 3% చొప్పున ఎగశాయి. కొత్త మంత్రి రాకతో రైల్వే ఆర్డర్లపై అంచనాలు పెరిగాయని నిపుణులు పేర్కొన్నారు.
ఇక మరోవైపు పౌరవిమానయాన కొత్త ముసాయిదా విధానాల నేపథ్యంలో విమాన రంగ షేర్లు జెట్ ఎయిర్‌వేస్ 7%, స్పైస్ జెట్ 6% చొప్పున పురోగమించాయి. ఈ జూలై-సెప్టెంబర్(క్యూ2)లో జెట్ ఎయిర్‌వేస్ రూ. 70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం కూడా ఇందుకు దోహదపడిందని నిపుణులు తెలిపారు. గత క్యూ2లో రూ. 891 కోట్ల నష్టాలు నమోదయ్యాయి.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, పవన్ హంస్‌లను లిస్టింగ్ చేయడం, ఎయిర్ ఇండియాను ప్రయివేటీకరించడం, విమాన ఇంధన ధరలను హేతుబద్ధీకరించడం వంటి అంశాలు కొత్త పాలసీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఆడిదాస్ గ్రూప్‌తో ఒప్పందం కారణంగా లవబుల్ లింగరీ షేరు 20% దూసుకెళ్లింది.
నిఫ్టీ కొత్త రికార్డు
మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ మరోసారి 28,000 పాయింట్లను అధిగమించి ఇంట్రాడేలో 28,028కు చేరింది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం 8,383ను తాకింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా, సెన్సెక్స్ 6 పాయింట్ల లాభంతో 27,875 వద్ద నిలవగా, నిఫ్టీ 7 పాయింట్లు బలపడి 8,344 వద్ద స్థిరపడింది. ఇది కూడా రికార్డే.