
కొత్త శిఖరాల నుంచి జారిన మార్కెట్
మార్కెట్ అప్‌డేట్
⇒లాభాల స్వీకరణతో భారీ నష్టాలు
⇒499 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
⇒143 కోల్పోయి 8,809 స్థాయికి నిఫ్టీ
పది రోజుల స్టాక్ మార్కెట్ జోరుకు బ్రేక్ పడింది. శుక్రవారం కూడా సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. అయితే ప్రధాన షేర్లలో భారీగా లాభాల స్వీకరణ జరగడం, ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ్యాంక్ షేర్లు కుదేలవడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ కొత్త గరిష్ట స్థాయి(29,844 పాయింట్లు)ని, నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయి 8,997ని తాకాయి. శుక్రవారం ట్రేడింగ్ సెన్సెక్స్ 29,802 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్ది సేపటికే 29,844 గరిష్ట స్థాయికి చేరింది. లాభాల స్వీకరణ కారణంగా ఆ తర్వాత వెంటనే 29,070 పాయింట్లకు క్షీణించింది. రోజులో గరిష్టస్థాయి నుంచి కనిష్టస్థాయివరకూ 774 పాయింట్లు పడిపోయింది. చివరకు 499 పాయింట్లు నష్టపోయి 29,183 వద్ద ముగిసింది. గత మూడు వారాల్లో సెన్సెక్స్ ఒకేరోజున ఇంత ఎక్కువగా క్షీణించడం ఇదే ప్రధమం. ఈ నెల 6న బీఎస్‌ఈ సెన్సెక్స్ 855 పాయింట్లు పతనమైంది. ఇక నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 8,809 పాయింట్ల వద్ద ముగిసింది.
రియల్టీ షేర్ల జోరు: అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నాయని, దీనికి ప్రధాన షేర్లలో లాభాల స్వీకరణ తోడవడంతో స్టాక్ మార్కెట్లు పడిపోయాయని రెలిగేర్ సెక్యూరిటీస్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుల్లో విదేశీ నిధులు అనుమతించడానికి ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ను సవరించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా కేబినెట్ నోట్‌ను సిద్ధం చేస్తోందన్న వార్తల కారణంగా రియల్టీ షేర్లు పెరిగాయి.
బేర్‌మన్న బ్యాంక్ షేర్లు: రుణ నాణ్యతలపై ఆందోళన కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం తగ్గి రూ.361 వద్ద ముగిసింది. ఆర్థిక ఫలితాలు బాగా లేకపోవడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా 11 శాతానికి పైగా క్షీణించి రూ.193 వద్ద ముగిసింది. దీంతో మిగతా బ్యాంక్ షేర్లూ బేర్‌మన్నాయి. బ్యాంక్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.