
లాభాల స్వీకరణతో నష్టాల్లోకి మార్కెట్...
ముంబై: నూతన గరిష్టాలకు చేరిన అనంతరం ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడంతో సూచీలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం సెన్సెక్స్ దాదాపు 54, నిఫ్టీ 21 పాయింట్లు క్షీణించాయి. ఐటీ, చమురు, గ్యాస్ షేర్లలో లాభాలు స్వీకరించడం, బొగ్గు గనుల కేటాయింపులపై ఉత్తర్వును సుప్రీం కోర్టు రిజర్వులో ఉంచడంతో మార్కెట్లు అప్రమత్తం కావడం ఇందుకు కారణాలు. వినియోగ ధరలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారంలో వెల్లడికానుండడంతో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ అంట్ టీ, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఆర్‌ఐఎల్ వంటి కౌంటర్లు బలహీనంగా ఉండడం బెంచ్‌మార్క్ సూచీలపై ప్రభావం చూపింది. సిప్లా, కోల్ ఇండియా, గెయిల్, టాటా మోటార్స్, ఐటీసీ, మహింద్రా అండ్ మహింద్రా, టాటా పవర్ షేర్లు పుంజుకోవడం సూచీల నష్టాన్ని కొంతమేర అడ్డుకుంది.
ఉదయం స్థిరంగా పునఃప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం అమ్మకాల ఒత్తిడితో ఓదశలో 143 పాయింట్లు తగ్గిపోయి 27,177.09 పాయింట్ల స్థాయికి చేరింది. తర్వాత పుంజుకుని 27,265.32 వద్ద ముగిసింది. సోమవారం క్లోజింగ్‌తో పోలిస్తే సెన్సెక్స్ 54.53 పాయింట్లు (0.20) శాతం తగ్గింది. నిఫ్టీ కూడా 20.95 పాయింట్లు (0.26 శాతం) క్షీణించి 8,152.95 పాయింట్లకు చేరింది. రియల్టీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ ఈక్విటీల్లో అమ్మకాల ఒత్తిడి కన్పించింది.
ఫండ్స్‌లోకి భారీ నిధులు
న్యూఢిల్లీ: వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మదుపరులు రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. జూలైలో ఈ మొత్తం రూ.1,13,216 కోట్లు కాగా, ఆగస్టులో రూ.1,00,181 కోట్లుగా నమోదయ్యింది. జూన్‌లో రూ. 59,726 కోట్లు ఫండ్స్ నుంచి ఉపసంహరణలు జరిగాయి.
‘శారదా’ ఆఫర్‌కు మంచి స్పందన...
శారదా క్రాప్‌కెమ్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. రూ.352 కోట్ల సమీకరణకు జారీచేసిన ఐపీఓ 60 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గత శుక్రవారం ప్రారంభమైన ఈ ఇష్యూ మంగళవారం ముగిసింది.