ఎదురులేకుండా సాగుతున్న షేర్ మార్కెట్ కు బ్రేక్ పడింది.
ముంబై:ఎదురులేకుండా సాగుతున్న షేర్ మార్కెట్ కు బ్రేక్ పడింది. పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంగళవారం షేర్ మార్కెట్ భారీ పతనాన్ని చవిచూసింది. దేశీయ షేర్ మార్కెట్ లో సెన్సెక్స్ 518 పాయింట్లుకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం 26, 190 పాయింట్ల తాకిన సెన్సెక్స్ నేడు అత్యల్పంగా పడిపోయి 25,582 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ మాత్రం కొద్దిలో కొద్ది మెరుగనిపించింది. 164 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 7,623 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇలా దేశీయ షేర్ మార్కెట్ ఒక్కసారిగా పాతాళానికి దిగజారిపోవడం 2013 సెప్టెంబరు తరువాత ఇదే తొలిసారి. మంగళవారం రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తరువాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. రైల్వే బడ్జెట్ మార్కెట్లకు ఏమీ ప్రతికూలంగా లేదని వారు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలిక దృక్పథం నుంచి చూస్తే రైలు బడ్జెట్ ఫర్వాలేదు కానీ,స్టాక్ మార్కెట్ కు ఒరిగిందేమీ లేదని అంటున్నారు. సాధారణ బడ్జెట్ రోజు మార్కెట్ భారీ పతనాన్ని దిగజారడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.