
ఆరో సెషన్‌లోనూ అధోముఖంగానే
* 8,700 దిగువకు నిఫ్టీ
* సెన్సెక్స్ నష్టం 133 పాయింట్లు
* ప్రభావం చూపిన ముడి చమురు పెరుగుదల
మార్కెట్ అప్‌డేట్
బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాల పాలయ్యాయి.
విదేశీ నిధులు వస్తున్నప్పటికీ, అంతర్జాతీయ సంకేతాలతో సెంటిమెంట్ దెబ్బతిన్నదని, ఢిల్లీ ఎన్నికల అంశం కూడా ప్రభావం చూపిందని ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికా ఉద్యోగాల నివేదిక వెలువడనున్న నేపధ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, జర్మనీ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండడం, యూరోజోన్‌లో గ్రీస్ భవితవ్యంపై ఆందోళనల కారణంగా యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం ప్రభావం చూపాయి. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన లిబియాలో మరింత అశాంతి ప్రజ్వరిల్లనున్నదనే నివేదికలతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ పెరగడం కూడా స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమైంది.
శుక్రవారం కూడా లాభాల స్వీకరణ కొనసాగింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు పెరగ్గా, వాహన,బ్యాంక్, చమురు, గ్యాస్, విద్యుత్తు, ఆరోగ్య సంరక్షణ, కన్సూమర్ డ్యూరబుల్స్, కొన్ని లోహ షేర్లు స్టాక్‌మార్కెట్‌ను పడగొట్టాయి. శుక్రవారం సెన్సెక్స్ 133 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల చొప్పున క్షీణించాయి. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువన 8,661 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లకు ఇది రెండు నెలల్లో అధ్వాన్న వారం.
ఢిల్లీ ఎన్నికల ప్రభావం !
బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలకు తోడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఊహాగానాలు స్టాక్ మార్కెట్లను పడగొట్టాయని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. జీడీపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు వచ్చేవారం వెలువడనున్నందున ఇన్వెస్టర్లు ఆచి, తూచి అడుగులేస్తున్నారని నిపుణులంటున్నారు.
శనివారం పోలింగ్ జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, ఆ ప్రభావం సంస్కరణలపై ఉంటుందనే ఆందోళన ట్రేడర్లలో నెలకొన్నదని నిపుణులంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం మార్కెట్లపై స్వల్పకాలమే ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ నివేదిక పేర్కొంది. ఢిల్లీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనే అంచనాలను ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్ చేశాయని భారత్ భూషణ్ ఈక్విటీస్‌కు చెందిన విజయ్ భూషణ్ వ్యాఖ్యానించారు.
28, 892 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ప్రారంభ కొనుగోళ్ల కారణంగా 28,923 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత 28,647 కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 133 పాయింట్లు నష్టపోయి 28,718 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 465 పాయింట్లు నష్టపోయింది. గత ఏడాది డిసెంబర్ 12తో ముగిసిన వారానికి సెన్సెక్స్ 1,107 పాయింట్లు నష్టపోయింది. అప్పటి నుంచి చూస్తే, ఇదే అతి పెద్ద వారాంత క్షీణత. ఇక వరుసగా ఆరు సెషన్లలో సెన్సెక్స్ 964 పాయింట్లు నష్టపోయింది.
5 శాతం క్షీణించిన టాటా మోటార్స్
డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు బాగా లేకపోవడంతో టాటా మోటార్స్ షేర్ 5 శాతం వరకూ క్షీణించింది. సెన్సెక్స్‌లో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే.