102 పాయింట్లు ప్లస్
* 25,576 వద్దకు సెన్సెక్స్
* ఇంట్రాడేలో 25,600పైకి
* పలుమార్లు హెచ్చుతగ్గులు
* ఎఫ్‌ఐఐల పెట్టుబడులు
పలుమార్లు ఊగిసలాటకు లోనైనప్పటికీ చివరికి మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు లాభపడి 25,576 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 23 పాయింట్లు బలపడి 7,650 వద్ద నిలిచింది. రోజు మొత్తం 200 పాయింట్ల పరిధిలో హెచ్చుతగ్గులను చవిచూసిన సెన్సెక్స్ ఒక దశలో 25,600ను అధిగమించడం గమనార్హం. కాగా, ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మే రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. వీటిపై దృష్టితో ఇన్వెస్టర్లు కొంతమేర ఆచితూచి వ్యవహరించారని నిపుణులు పేర్కొన్నారు. ఐఐపీ మెరుగుపడటం, సీపీఐ బలహీనపడటం వంటి అంశాలు వడ్డీ రేట్ల తగ్గింపునకు రిజర్వ్ బ్యాంక్‌కు అవకాశమిస్తాయని వ్యాఖ్యానించారు.
భారతీ డీలా
బ్లూచిప్స్‌లో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ షేరు 4% పతనమైంది. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ క్రెడిట్ స్వీస్ న్యూట్రల్ నుంచి అండర్‌పెర్ఫార్మ్ స్థాయికి షేరును డౌన్‌గ్రేడ్ చేయడమే దీనికి కారణం. ముకేష్ గ్రూప్ సంస్థ రిలయన్స్ జియో నుంచి పెరగనున్న పోటీ నేపథ్యంలో రేటింగ్‌ను తగ్గించింది. మిగిలిన దిగ్గజాలలో కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, భెల్, ఆర్‌ఐఎల్, ఐసీఐసీఐ 2-0.5% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు హిందాల్కో 4% పుంజుకోగా, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, మారుతీ, ఎన్‌టీపీసీ, టీసీఎస్ 3-1% మధ్య లాభపడ్డాయి. ఇక కొత్త సీఈవోను ప్రకటించిన ఇన్ఫోసిస్ 0.4% నష్టపోయింది.
చిన్న షేర్లు ఓకే
మెరుగుపడ్డ సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5% స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,746 లాభపడగా, 1,356 తిరోగమించాయి. ఎఫ్‌ఐఐలు రూ. 652 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ సంస్థలు రూ. 742 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.