
ఆర్థిక మందగమన పరిస్థితులను చక్కదిద్దే మరిన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టనున్నదన్న అంచనాల కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కూడా కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 37,000, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,000 పాయింట్లపైకి ఎగబాకాయి. ఆర్థిక, బ్యాంక్, వాహన రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 164 పాయింట్లు లాభపడి 37,145 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11,003 వద్ద ముగిశాయి. ముడి చమురు ధరలు పెరిగినా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. టెలికం, క్యాపిటల్ గూడ్స్, మౌలిక, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి.
460 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్...: సెన్సెక్స్ నష్టాల్లో ఆరంభమైనా, ఆ తర్వాత పుంజుకుంది. ఒక దశలో 198 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 262 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 460 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. వాహన రంగంతో సహా వివిధ రంగాల్లో నెలకొన్న మందగమనాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోగలదన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయని నిపుణులు పేర్కొన్నారు. హాంగ్‌సెంగ్ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
ఏడాది కనిష్టానికి 70 షేర్లు
స్టాక్ మార్కెట్ లాభపడినప్పటికీ, దాదాపు 70 షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. రిలయన్స్ నావల్, మెర్కటర్, ఎస్‌ఆర్‌ఎస్, సుజ్లాన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు బాటా ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్, ఇండియామార్ట్ ఇంట్‌మెష్ తదితర షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.
Comments
Please login to add a commentAdd a comment