లాభాల వర్షం
విస్తరిస్తున్న రుతుపవనాలు స్టాక్ ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. మార్కెట్ ఒక్కసారిగా రివ్వున ఎగసింది. చివరి వరకూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 222 పాయింట్లు ఎగసింది. 25,229 వద్ద ముగిసింది. వెరసి ఐదు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,100 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 72 పాయింట్లుపైగా పుంజుకుని 7,527 వద్ద నిలిచింది. అటు టోకు ధరలు, ఇటు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఉపశమించడంతో వడ్డీ ప్రభావిత రంగాలపై ఇన్వెస్టర్లు కన్నేశారని విశ్లేషకులు పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం తగ్గడంతో వచ్చే నెలలో చేపట్టనున్న పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశముందన్న అంచనాలు ఇందుకు దోహదపడ్డాయని తెలిపారు. ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలు 2-3% మధ్య పుంజుకున్నాయి. మే నెల పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడం కూడా సెంటిమెంట్‌ను మెరుగుపరచిందని విశ్లేషకులు తెలిపారు.