రెండు నెలల కనిష్టం
26,272 వద్దకు సెన్సెక్స్
296 పాయింట్లు పతనం
పడగొట్టిన విదేశీ అంశాలు
అమ్మకాల బాటలో ఎఫ్‌ఐఐలు
అన్ని రంగాలూ నష్టాల్లోనే
వరుస సెలవుల తరువాత మొదలైన దేశీ స్టాక్ మార్కెట్లను విదేశీ అంశాలు పడగొట్టాయి. అమెరికా వడ్డీ పెంపు భయాలు, జర్మనీ పారిశ్రామికోత్పత్తి క్షీణత, చైనా మందగమన సంకేతాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. జమ్ము ప్రాంతంలోని పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పులవల్ల ఏర్పడ్డ టెన్షన్లు వీటికి జతకలిసినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి సెన్సెక్స్ 296 పాయింట్లు పతనమైంది. నెల రోజుల కనిష్టం 26,272 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 93 పాయింట్లు పడి 7,852 వద్ద స్థిరపడింది.
అంచనాలకంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును చేపట్టవచ్చునన్న ఆందోళనలు ప్రధానంగా ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు పరుగుపెట్టించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సమావేశం వివరాలు బుధవారం వెల్లడికానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లు ఎఫ్‌వోఎంసీ వ్యాఖ్యలపై ఆసక్తిగా ఉన్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా ఉద్యోగ గణాంకాలు మెరుగుపడటంతో ముందుగానే వడ్డీ పెంపు ప్రకటన ఉండవచ్చునని పలువురు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
యూరప్ ఆందోళనలు
ఇప్పటికే చైనా తయారీ రంగం మందగిస్తున్న సంకేతాలు వెల్లడికాగా, తాజాగా జర్మనీ పారిశ్రామికోత్పత్తి ఆగస్ట్‌లో ఐదున్నరేళ్ల కనిష్టానికి పడింది. దీంతో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 26,487 వద్ద నష్టాలతో మొదలైంది. ఆపై 26,250 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 7,843 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. గత వారం అమ్మకాలవైపు యూటర్న్ తీసుకున్న ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 333 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీ ఫండ్స్ మాత్రం రూ. 328 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. గత వారంలో ఎఫ్‌ఐఐలు రూ. 2,300 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని వివరాలివీ
* బీఎస్‌ఈలో అన్ని రంగాలూ నష్టపోగా, చైనా ప్రభావంతో మెటల్స్ అత్యధికంగా 2.7% దిగజారింది. ఈ బాటలో హెల్త్‌కేర్, వినియోగ వస్తువులు, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 1.5% స్థాయిలో క్షీణించాయి.
* మెటల్ షేర్లలో జిందాల్ స్టీల్, హిందాల్కో, సెసాస్టెరిలైట్, ఎన్‌ఎండీసీ 4%పైగా తిరోగమించాయి.
* హెల్త్‌కేర్ షేర్లలో ఇప్కాల్యాబ్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ 4-3% మధ్య
నీరసించాయి.
* మిగిలిన దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం, హీరో మోటో, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ 3-2% మధ్య నష్టపోయాయి.
* మరోవైపు ఎన్‌టీపీసీ, గెయిల్ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో 1% చొప్పున లాభపడ్డాయి.
* మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో క్షీణించగా, ట్రేడైన షేర్లలో 1,767 నష్టపోయాయి. 1,111 మాత్రమే
లాభపడ్డాయి.
* ఎఫ్‌ఐఐల పెట్టుబడి పరిమితి పెరగడంతో అపోలో టైర్స్ 6%, షేరుకి రూ. 105 ప్రత్యేక డివిడెండ్ ప్రకటనతో స్ట్రైడ్స్ ఆర్కోలాబ్ 4% చొప్పున ఎగశాయి. ఐఎఫ్‌సీ రూ. 616 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్న వార్తలతో బిల్ట్ 8% జంప్‌చేసింది.