బెస్ట్ సెల్లింగ్ మోడల్ మళ్లీ ‘ఆల్టో’నే
♦ కొనసాగుతోన్న మారుతీ ఆధిపత్యం
♦ టాప్–10లో ఏడు మోడళ్లు ఈ కంపెనీవే
న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్‌లో దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటిలాగే ఈ కంపెనీకి చెందిన ఏడు కార్లు ‘టాప్–10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్’ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. తాజాగా మే నెల వాహన విక్రయాల్లో ‘ఆల్టో’.. మళ్లీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవతరించింది. సియామ్ తాజా గణాంకాల ప్రకారం..
♦ మారుతీ ఆల్టో విక్రయాలు ఈ మే నెలలో 23,618 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఇదే నెలలో ఆల్టో అమ్మకాలు 19,874 యూనిట్లుగా ఉన్నాయి.
♦ ఏప్రిల్ నెలలో టాప్‌లో నిలిచిన మారుతీ స్విఫ్ట్.. ఈసారి రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దీని విక్రయాలు 12,355 యూనిట్ల నుంచి 16,532 యూనిట్లకు పెరిగాయి.
♦ మారుతీకి చెందిన వ్యాగన్–ఆర్ 15,471 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానం దక్కించుకుంది. గతేడాది ఇదే నెలలో వ్యాగన్–ఆర్ విక్రయాలు 13,231 యూనిట్లుగా ఉన్నాయి.
♦ 14,629 యూనిట్ల విక్రయాలతో మారుతీ బాలెనో నాల్గవ స్థానంలో ఉంది.
♦ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఐదో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 12,055 యూనిట్ల నుంచి 12,984 యూనిట్లకు పెరిగాయి.
♦ మారుతీ విటారా బ్రెజా 12,375 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో ఈ కారు 7,193 యూనిట్లతో పదో స్థానంలో ఉంది.
♦ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏడో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 10,667 యూనిట్లుగా ఉన్నాయి.
♦ 9,073 యూనిట్ల అమ్మకాలతో మారుతీ డిజైర్ ఎనిమిదో స్థానంలో ఉంది.
♦ హ్యుందాయ్ క్రెటా 8,377 యూనిట్ల విక్రయాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
♦ మారుతీ ఎర్టిగ పదో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 7,121 యూనిట్లుగా నమోదయ్యాయి.
♦ టాప్–10లో మారుతీ, హ్యుందాయ్ మోడళ్లు తప్పు వేరే ఇతర వాహన కంపెనీల కార్లు లేకపోవడం గమనార్హం.