మియాపూర్‌లోని ఓ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కారణం, నిధుల్లేక కాదు.. లేబర్ దొరక్క! సార్వత్రిక ఎన్నికలని వెళ్లిన కార్మికులు తిరిగి రావట్లేదనేది కాంట్రాక్టర్ వాదన. పోనీ, స్థానిక లేబర్స్‌తో పనులను చక్కబెట్టేద్దామంటే? నైపుణ్య సమస్య!
.. ఇది కేవలం ప్రైవేట్ డెవలపర్లే కాదండోయ్.. హౌసింగ్ ఫర్ ఆల్, కేసీఆర్ 2 బీహెచ్‌కే వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా గృహాల నిర్మాణం ఆలస్యమవుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది కార్మికులున్నారు. ఇందులో నైపుణ్యమున్న కార్మికులు 2 కోట్ల లోపే. పస్తుతం 6.42 లక్షల మంది సివిల్ ఇంజనీర్లు, 65 వేల మంది ఆర్కిటెక్ట్‌లు, 18 వేల మంది ప్లంబర్లు అందుబాటులో ఉన్నారు. 2022 నాటికి ఈ రంగంలో 8.3 కోట్ల మంది కార్మికులు అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కార్మికులతో పాటూ ప్లానర్స్, ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, సర్వేయర్స్, ఆర్కిటెక్ట్స్ వంటి అన్ని విభాగాల్లోనూ మానవ వనరుల అవసరం ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 70–75 వేల మంది నిర్మాణ కార్మికులుంటారు. గతంలో ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల కార్మికులు హైదరాబాద్ నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్లు. కానీ, ప్రభుత్వ ఉచిత పథకాల కారణంగా చాలా వరకు కార్మి కుల వలస తగ్గిపోయింది. దీంతో బిహార్, మహారాష్ట్ర, కోల్‌కతా, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల కార్మికుల మీద ఆధారపడాల్సి వస్తుంది.
కార్మికుల ధరలివే: రోజుకు మేస్త్రీకి రూ.700–900, లేబర్ (మగవారికి) రూ.450–500, ఆడవాళ్లకు 300–350, షటరింగ్‌కు చ.అ.కు రూ.12–14, రాడ్ బెండింగ్ టన్నుకు రూ.6,000.
ఎందుకు తగ్గిపోయారంటే?
► ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లోనే నిర్మాణ పనులు జరుగుతుండటంతో మెట్రో నగరాలకు కార్మికుల వలస తగ్గింది.
► సార్వత్రిక ఎన్నికల కని వెళ్లిన కార్మికులు తిరిగి పనులకు రాకపోవటం.
► కార్మికుల్లో కష్టపడే తత్వం తగ్గిపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడకపోవటం.
► వేతన అసమానతలు, కఠినమైన పని షెడ్యూల్డ్స్, ప్రసూతి సెలవులు లేకపోవటం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు.
► కనీస అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీరుస్తుండటం.
► ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, పింఛన్లు, బీమా, ఇల్లు ప్రభుత్వమే అందిస్తుండటం.
కార్మికుల కొరతతో ఏమవుతుందంటే?
► ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్మికులు, అరకొర పనిముట్లతో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులను చేయలేరు.
► కొనుగోలుదారులకు ఇచ్చిన గడువులోగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాదు. నిర్మాణం నాణ్యత దెబ్బతింటుంది.
► కార్మికులు, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి దాని ప్రభావం కంపెనీ కార్యకలాపాల మీద పడుతుంది. అంతిమంగా స్థిరాస్తి ధరలు పెరుగుతాయి.
► కంపెనీలకు నైపుణ్యమున్న మానవ వనరుల నియామకం, శిక్షణ భారంగా మారుతుంది.
టెక్నాలజీనే సరైన మందు..
నిర్మాణ పనుల్లో సాంకేతికతను వినియోగించడం ద్వారా కార్మికుల కొరతను అధిగమించవచ్చు. 80 శాతం కార్మికుల కొరతను టెక్నాలజీ భర్తీ చేస్తుంది. ఉదాహరణకు హై రైజ్ భవనాల్లో మైవాన్ టెక్నాలజీ, ప్రీ–కాస్ట్‌తో వాల్స్, కాలమ్స్, బీమ్స్‌ల ఏర్పాటు, రోబోటిక్స్‌తో పెయింటింగ్ వంటివి. నిర్మాణ పనుల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కూడా ముందుకురావాలి. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. డెవలపర్ల సంఘాలతో కలిసి ప్రభుత్వం కార్మికులకు నైపుణ్య శిక్షణతో పాటూ పూర్తి స్థాయి పనిముట్లను సమకూర్చాలని సూచిస్తున్నారు.
చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు చుక్కలే..
హై రైజ్ భవనాలు, ఒకే రకమైన గృహ సముదాయాలకు, కమర్షియల్ ప్రాజెక్ట్‌లకు మైవాన్ షటరింగ్ టెక్నాలజీ కరెక్ట్. చిన్న ప్రాజెక్ట్‌లకు ఈ టెక్నాలజీని వినియోగించలేం. ఎందుకంటే డెవలపర్లకు వ్యయం భారంగా మారుతుందని ఓ డెవ లపర్ తెలిపారు. నైపుణ్యమున్న కార్మికుల కొరత కారణంగా 100 మంది పనిచేయాల్సిన చోట 20 మంది మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. 7–8 అంతస్తుల్లోపు నిర్మాణాలు చేపట్టే 85 శాతం చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు కార్మికులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
ఆర్‌అండ్‌డీ అవసరం
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేకపోవటంతో పెద్ద ప్రాజెక్ట్‌లకు అందుబాటులో ఉన్నంత సులువుగా, సౌకర్యవంతంగా చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు అందట్లేదు. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు మేనేజ్‌మెంట్‌తో పాటూ నిర్మాణ సాంకేతికత మీద కూడా పరిశోధనలు చేయాల్సిన అవసరముంది.
– ఇంద్రసేనా రెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్
ప్రీ–కాస్ట్ గృహాల మీద అవగాహన కల్పించాలి
ప్రధాన నగరంలో ప్రీ–కాస్ట్ తయారీ యూనిట్లను నెలకొల్పి.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఉత్పత్తులను సరఫరా చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం, డెవలపర్ల సంఘాలు ముందుకురావాలి. ప్రీ–కాస్ట్ గృహాల అన్ని రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకోవనో లేదా నాణ్యత విషయంలోనో ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలి. ఇందుకోసం డెవలపర్ల సంఘాలు, ప్రభుత్వం విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలి.
– సీ రామచంద్రా రెడ్డి, జనరల్ సెక్రటరీ, క్రెడాయ్
రెరా, జీఎస్‌టీ, బినామీ ట్రాన్స్‌యాక్షన్ యాక్ట్ వంటి చట్టాలతో దేశంలో రియల్టీ లావాదేవీలు పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెరిగింది. దీంతో ఎన్‌ఆర్‌ఐ వ్యక్తిగత పెట్టుబడులు, ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్, మాల్స్, గ్రేడ్–ఏ ఆఫీస్‌లు, కో–వర్కింగ్
ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment