విజయ్! ఫండ్స్‌తోనే కావాల్సిన నిధి
సిప్ చేస్తే దీర్ఘకాలిక లక్ష్యాలు ఈజీనే
నా పేరు విజయ్‌కుమార్. వయసు 36 ఏళ్లు. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నాతో పాటు నా భార్య, 5 ఏళ్ల అబ్బాయి అరుణ్ ఉంటున్నారు. నాకు నెలకు రూ.లక్ష జీతం వస్తోంది. జీతంగా లక్ష రూపాయల వరకు వస్తున్నాయి. ఇందులో రూ.35,000 వరకు పొదుపు చేస్తున్నాను.
నా సేవింగ్స్ విషయానికి వస్తే..
ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ట్యాక్స్ సేవింగ్ పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఈ విలువ లక్ష రూపాయలుగా ఉంది. ప్రతి ఏటా ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.18,000 కడుతున్నాను. ఈ పాలసీ 2027లో మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ కింద రూ. 6.5 లక్షలు వస్తాయి. ఈపీఎఫ్ కింద ప్రతి నెలా రూ. 3,500 జీతంలో కోత కోస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఖాతాలో రూ. 1.35 లక్షలు వరకు ఉన్నాయి. నా ఆర్థిక లక్ష్యాల విషయానికి వస్తే...55 ఏళ్ల నాటికి పదవీ విరమణ చేయాలనుకుంటున్నా. అప్పటికి పూర్తి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనుకుంటున్నాను. అలాగే అరుణ్ ఉన్నత చదువులకు తగిన నిధి సమకూర్చుకోవాలన్నది నా లక్ష్యం. ప్రస్తుతం విద్యావ్యయం రూ.5 లక్షలుగా ఉంది. దీని ప్రకారం తగిన ఆర్థిక ప్రణాళికను సూచించగలరు.
హాయ్!.. విజయ్‌కుమార్ గారు... మీ ఆదాయం, వ్యయాలు, పొదుపు, ఆర్థిక లక్ష్యాల గురించి చాలా వివరణాత్మకంగా రాశారు. అలాగే మీ పెట్టుబడులను అంతా ఒకేదానిలో కాకుండా వివిధ పథకాలకు కేటాయించడం ద్వారా నష్ట భయాన్ని తగ్గించుకున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చు.
మీ రెండు లక్ష్యాలు దీర్ఘకాలానికి చెందినవే. ఇందులో మొదటిది మీ అరుణ్ ఉన్నత విద్యకి చేరుకోవడానికి ఇంకా 15 ఏళ్లు అంటే 2031 వరకు సమయం ఉంది. ప్రస్తుతం మీరు చదివించాలనుకున్న చదువుకు రూ.5 లక్షలు అవుతాయి. ఏటా విద్యా వ్యయం 7.5 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేస్తే.. 2031 నాటికి రూ.13.76 లక్షలు అవసరమవుతాయి. అదే రిటైర్మెంట్‌కు ఇంకా 19 ఏళ్ల సమయం ఉంది. ప్రస్తుతం మీ ఇంటి ఖర్చు నెలకు రూ.30,000 అవుతున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం ఏటా 6 శాతం చొప్పున లెక్కిస్తే 2035 నాటికి రిటైర్మెంట్ నిధి కనీసం రూ.3.59 కోట్లు అవసరమవుతాయి.
రిటైర్మెంట్‌కు.. ఫండ్స్‌లో పెట్టుబడి!
మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి నెలా అదనంగా రూ.34,000 అవసరమవుతాయి. ప్రస్తుతం మీరు రూ.35,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అదనంగా ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు కేటాయించండి.
సిప్ విధానంలో ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవచ్చు. మీ రిస్క్ సామర్థ్యాన్ని మధ్యస్థంగా అంచనా వేసుకొని ఈ పోర్ట్‌ఫోలియోను సూచించడం జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని పిల్లవాడి చదువుకు వినియోగించుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి రిటైర్మెంట్‌కు అక్కరకు వస్తుంది.