బీమాతో ఇన్వెస్ట్ చేద్దాం.. | Should You Use Life Insurance as an Investment? | Sakshi
Sakshi News home page

బీమాతో ఇన్వెస్ట్ చేద్దాం..

Published Sun, Apr 6 2014 12:40 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

బీమాతో ఇన్వెస్ట్ చేద్దాం.. - Sakshi

బీమాతో ఇన్వెస్ట్ చేద్దాం..

 స్టాక్ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు 18 శాతానికిపైగా రాబడిని అందించాయి. ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే రానున్న కాలంలో కూడా ఇదే విధమైన రాబడులను ఆశించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో యులిప్స్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ ఐఆర్‌డీఏ నిబంధనలు మార్చడంతో తిరిగి వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ గత జ్ఞాపకాలు మాత్రం ఇంకా నీడలా అలాగే వెంటాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు గమనించాల్సిన అంశాలపై ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం.
 
 జీవిత బీమా రక్షణతో పాటు, ఇన్వెస్ట్‌మెంట్స్, పన్ను ప్రయోజనాలను కలిగి ఉండటం యూనిట్ ఆధారిత బీమా పథకాల (యులిప్స్) ప్రత్యేకత. అందుకే గతంలో వీటిని బాగా ఆదరించారు. కానీ తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయంటూ మిస్సెల్లింగ్‌కి తోడు స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడంతో చాలామంది వీటిల్లో ఇరుక్కుపోయారు. దీంతో యులిప్స్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఐఆర్‌డీఏ రంగంలోకి దిగి యులిప్స్ నిబంధనలను మార్చి పారదర్శకంగా తీసుకురావడంతో ఇప్పుడవి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా కొన్ని కంపెనీలు ఇప్పటికే యులిప్స్‌ను విడుదల చేయగా మరికొన్ని బీమా కంపెనీలు విడుదల చేసే యోచనలో ఉన్నాయి.
 
 ఐదేళ్ల లాకిన్
 యులిప్స్ పథకాల ద్వారా సేకరించిన మొత్తాన్ని బీమా కంపెనీలు స్టాక్ మార్కెట్లు, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీదారులకు లాభనష్టాలను అందిస్తాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది రిస్క్‌తో కూడుకున్నది కావడం, ఒడిదుడుకులుండటంతో వీటిని దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా పరిగణిస్తారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే యులిప్స్ లాకిన్ పీరియడ్‌ను మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. ఇప్పుడు యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కనీసం ఐదేళ్ల వరకు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. దీంతో నష్టభయం బాగా తగ్గింది.
 
 తగ్గిన సరెండర్ చార్జీలు
 కాలపరిమితి కంటే ముందుగానే సరెండర్ చేస్తే పెనాల్టీలు భారీగా ఉండేవి. ఇప్పుడు ఇలా మధ్యలో మానేసిన వారికోసం డిస్‌కంటిన్యుయేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేయడంతో సరెండర్ చార్జీలు బాగా తగ్గాయి. దీంతో అత్యవసర సమయాల్లో పాలసీని కాలపరిమితి కంటే ముందుగానే రద్దు చేసుకుంటే అధిక పెనాల్టీలు చెల్లించే బాధ తప్పింది. గరిష్టంగా రూ.6,000 మించి సరెండర్ వేల్యూ విధించకూడదు.
 
 కమీషన్లు తగ్గాయి
 గతంలో యులిప్స్ పథకాలను విక్రయిస్తే ఏజెంట్లకు మొదటి సంవత్సరం 30 నుంచి 40 శాతం వరకు కమీషన్లు వచ్చేవి. ఇప్పుడు గరిష్టంగా 15 శాతం మించి ఇవ్వడానికి వీలు లేదు. అలాగే రెండో ఏడాది 7.5%, మూడో ఏడాది నుంచి 5 శాతం మించి కమీషన్లు ఇవ్వడానికి లేదు. కమీషన్లు తగ్గడంతో ఆ మేరకు రాబడి పెరిగింది. ఇదే కాకుండా ఇతర ఫండ్ నిర్వహణ చార్జీలను కూడా బాగా తగ్గించడంతో పాటు వీటిల్లో పారదర్శకత తెచ్చారు.
 
 కట్టకపోయినా రద్దు కాదు..
 సాధారణంగా బీమా పథకాల్లో ప్రీమియంలు చెల్లించకపోతే పాలసీ రద్దు అవుతుంది. దీంతో బీమా పథకం అందించే ప్రయోజనాలన్నీ రద్దు అవుతాయి. కానీ ఇప్పుడు యులిప్స్‌లో అటువంటి ఇబ్బంది లేదు. ఒక వేళ ప్రీమియం కట్టడం ఆపేస్తే అప్పటి దాకా ఉన్న ఫండ్ విలువను డిస్‌కంటిన్యూడ్ ఫండ్‌కి బదలాయిస్తారు. పాలసీ కాలపరిమితి తీరే వరకు లేదా తిరిగి ప్రీమియంలు చెల్లింపులు మొదలు పెట్టేవరకు ఈ పాలసీ అకౌంట్ వేల్యూ కొనసాగుతూనే ఉంటుంది. ఇలా బదలాయించిన డిస్‌కంటిన్యూడ్ ఫండ్‌లో ఉన్న విలువపై సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీని తప్పనిసరిగా ఇవ్వాలని ఐఆర్‌డీఏ ఆదేశించింది. అంటే ప్రస్తుత రేటు ప్రకారం ఈ డిస్‌కంటిన్యూడ్ ఫండ్‌పై 4 శాతం గ్యారంటీ రాబడి వస్తుందన్నమాట.
 
 పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్
 యులిప్స్‌లో ఉన్న ప్రధానమైన ఆకర్షణ ఏమిటంటే... మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను రక్షించుకోవడానికి ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కి మారవచ్చు. కొన్ని బీమా కంపెనీలైతే ఇలా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కి ఎన్నిసార్లైనా ఉచితంగా మారే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వయసు, రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యం, మార్కెట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా డెట్, ఈక్విటీ పథకాల్లోకి మన పెట్టుబడులను మార్చుకోవచ్చు. ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నది తెలియకపోతే కొన్ని బీమా కంపెనీలు వయసు, రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఒక ఫండ్‌ను ఎంపిక చేస్తాయి.
 -సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 పెరుగుతున్నాయనైతే వద్దు..
 ఇప్పుడున్న ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో అత్యంత పారదర్శకత కలిగినవి యులిప్స్ అని చెప్పవచ్చు. చార్జీలు తక్కువగా ఉండటంతో దీర్ఘకాలిక దృష్టితో యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయన్న దృష్టిలో పెట్టుబడి పెట్టకూడదు. ఈక్విటీల్లో ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి వీటికి సిద్ధపడి, దీర్ఘకాలం వేచి చూడగలిగేవారే ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను. ప్రస్తుతానికి మార్కెట్లు పెరుగుతున్నా గత భయాలు ఇంకా వెంటాడుతుండటంతో కొత్తగా ఎటువంటి డిమాండ్ కనిపించడం లేదు. 
 - డాక్టర్ పి. నందగోపాల్,
 
 ఎండి, సీఈవో ఇండియా ఫస్ట్ లైఫ్
 బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలపొద్దు
 జీవిత బీమా రక్షణ, పెట్టుబడి అనేవి రెండు విభిన్నమైనవి. ఎప్పుడూ ఈ రెండింటినీ కలిపి చూడొద్దు. దీర్ఘకాలిక లక్ష్యానికయితే యులిప్స్ కంటే... ఒక టర్మ్ ప్లాన్ తీసుకొని మిగిలిన మొత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను. ఒకవేళ పన్ను ప్రయోజనాలు కావాలంటే ఎటువంటి రిస్క్ లేకుండా 8-9 శాతం రాబడిని అందించే సాధనాలు ఎలాగూ ఉన్నాయి. అయినా సరే యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామంటే మాత్రం నాలుగైదేళ్ళ దృష్టితో కాకుండా కనీసం 10 ఏళ్లు వేచి ఉండగలిగితేనే ఇన్వెస్ట్ చేయండి.
 - మాధవి రెడ్డి,
 సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
 
 కంపెనీ పేరు యులిప్స్ పథకాలు
 ఐసీఐసీఐ ప్రు లైఫ్ గ్యారంటీ వెల్త్ ప్రొటెక్టర్, ఎలైట్ లైఫ్
 హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ప్రొ గ్రోత్, ఇన్వెస్ట్ వైజ్
 మాక్స్ లైఫ్ ఫాస్ట్ ట్రాక్ సూపర్,
 ఫర్ ఎవర్ యంగర్ పెన్షన్, శిక్షా ప్లస్ సూపర్ 
 ఇండియా ఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్
 
 గుర్తుంచుకోవాల్సినవి...
 4  యులిప్స్ ఎటువంటి గ్యారంటీ రాబడులను
     అందించవు.
 4  ఇది దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనం.
 4  కనీసం 10 ఏళ్లు వేచి చూసేవారికే అనువైనవి.
 4  మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్స్‌లో
     పెట్టుబడులు మార్చుకోవచ్చు.
 4  చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ ప్రకారం లక్ష 
     వరకు పన్ను మినహాయింపు.
 4  రాబడులపై ఎటువంటి పన్ను భారం ఉండదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement