
ఇ-కామర్స్‌లోకి స్పైస్‌జెట్: 25శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్ జెట్ తన వ్యాపార సరళినిమరింత విస్తరించుకుంటోంది. రిటైల్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతున్న సంస్థ ఈ కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. తద్వారా భారీ ఆదాయాలపై దృష్టిపెట్టింది. సుమారు రూ. 15 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. స్పైస్ స్టయిల్.కాం పేరుతో తన రీటైల్ పోర్టల్‌ను లాంచ్ చేయనుంది.
దేశీయ విమానయాన రంగంలో వేగంగా పెరుగుతున్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆదాయాలను పెంచుకోవడానికి రిటైల్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తోంది. స్పైస్ స్టయిల్ పేరుతో రిటైల్ విభాగంలోకి విస్తరించిన స్పైస్జెట్ ఇ-కామర్స్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో సంవత్సరానికి రూ.150 కోట్ల విలువైన అదనపు ఆదాయాన్ని ఆర్జించనున్నామని తెలిపింది. దీని ద్వారా గత రెండు సంవత్సరాల్లో 17 శాతం పెరిగిన స్పైస్ జెట్ సహాయక ఆదాయంలో మరో 6 శాతం పెరగనుందని ఆ సంస్థ పేర్కొంది.
మరోవైపు అమెజాన్‌తో భాగస్వామ్యాన్ని కుదర్చుకున్నట్టు తెలిపింది. 17వివిధ కేటగిరీలను పరిచయం చేస్తున్నామని, ముఖ్యంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నామని చెప్పింది. తన కొత్త బ్రాండ్ల లాంచింగ్ కోసం అమెజాన్‌తో చేసుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో 25 శాతం డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఉత్తేజకరమైన ప్రయాణంలో, తమ ప్రత్యేకమైన పరిధిని పంపిణీ చేయటానికి ప్రముఖ ఇ-కామర్స్ మార్కెట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, అలాగే డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. స్పైస్ స్టయిల్.కాం లో కూడా ఆర్డరు చేయవచ్చని స్పైస్ జెట్ సిఎండి అజయ్ సింగ్ చెప్పారు.
కాగా స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ 46 ప్రదేశాల్లో సగటున 364 రోజువారీ విమానాలను నిర్వహిస్తుంది. ఇందులో 7 అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి.