ఎన్పీఏల వసూలుకు గట్టి చర్యలు చేపట్టండి
బ్యాంకులకు జైట్లీ సూచన
న్యూఢిల్లీ: దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకులు మొండి బకాయిల వసూలుకు తమ అధికారాలను వినియోగించుకుని పటిష్ట చర్యలు చేపట్టాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) పెరిగిపోవడాన్ని దేశ ఆర్థిక రంగం ముందున్న అతిపెద్ద సవాలుగా ఆయన అభివర్ణించారు. అవినీతి నిరోధక చట్టంలో మార్పులతోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎన్‌పీఏల వసూలులో వెసులుబాటు లభిస్తుందన్నారు. ఢిల్లీలో కాగ్ నిర్వహించిన ఓ సమావేశంలో జైట్లీ మాట్లాడారు. ఎన్‌పీఏల విషయంలో చట్టపరంగా, నిబంధనల పరంగా ఎన్నో పటిష్ట చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు.
‘‘ఎన్‌పీఏల వసూలుకు బ్యాంకులు తమ అధికారులను వినియోగించుకోవాలి. భారీ మొత్తంలో నగదు ఒకే వర్గం వద్ద నిలిచిపోతే, ఇతరులకు రుణాలిచ్చే అవకాశాలు దెబ్బతింటాయి. కొన్ని కేసుల విషయంలో బ్యాంకులు గట్టి చర్యలు చేపట్టేందుకు వీలుగా తగిన వీలు కల్పించాం. దీని ద్వారా ప్రజా ధనాన్ని నిరవధికంగా కలిగి ఉండరాదనే విషయాన్ని రుణ గ్రహీతలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బ్యాంకుల ధనం ప్రజాధనమే’’ అని స్పష్టం చేశారాయన. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రుణాల్లో 9.32 శాతానికి పెరిగిపోయి రూ.4.76 లక్షల కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే.