‘సట్లెజ్’పై ఎన్‌టీపీసీ కన్ను
కొనుగోలు చేయడానికి ప్రతిపాదన !
న్యూఢిల్లీ: జల విద్యుత్తు ఉత్పత్తి చేసే సట్లెజ్ జలవిద్యుత్ నిగమ్ (ఎస్‌జేవీఎన్)లో కేంద్రానికి ఉన్న వాటాను కొనుగోలు చేయాలని ఎన్‌టీపీసీ యోచిస్తోంది. దేశంలోనే అత్యధిక మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ఎన్‌టీపీసీ... ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసిందని సమాచారం. ఎస్‌జేవీఎన్‌లో కేంద్ర ప్రభుత్వానికి 64.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విలువ రూ.8,720 కోట్లని అంచనా. శిలాజ ఇంధనాల ద్వారా తయారు చేసే విద్యుదుత్పత్తిని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎన్‌టీపీసీ ఈ ప్రతిపాదన చేసింది.
అయితే ఈ ప్రతిపాదన విషయమై ఎన్‌టీపీసీ, ఆర్ధిక శాఖ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎన్‌టీపీసీ మొత్తం విద్యుదుత్పత్తిలో శిలాజ ఇంధనాల ద్వారా చేసే విద్యుదుత్పత్తి వాటా 97 శాతంగా ఉంది. దీనిని 2032 కల్లా 70 శాతానికి తగ్గించుకోవాలనేది ఈ కంపెనీ లక్ష్యం. కాగా ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాకుండా ద్రవ్యలోటు ఒకింత తగ్గుతుంది.
రెండు జలవిద్యుత్కేంద్రాలు...
సిమ్లా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్‌జేవీఎన్ కంపెనీ 1.9 గిగావాట్ల సామర్థ్యమున్న రెండు జల విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో 47.6 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. నేపాల్‌లో 900 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇక ఎన్‌టీపీసీకి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేసే జల విద్యుదుత్పత్తి ప్లాంట్ ఒకటే ఉంది. 545 మెగావాట్ల సౌర శక్తి ప్లాంట్లున్నాయి. మరిన్ని సౌరశక్తి విద్యుత్‌ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.