
హైదరాబాద్‌లో టెక్నోజెన్ ఐటీ సంస్థ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘రాజకీయ నాయకుడిగా పలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల ప్రారంభోత్సవంలో, సదస్సులు, సమావేశాల్లో పాల్గొన్నానే తప్ప.. నాకు ఏమాత్రం ఐటీ పరిజ్ఞానం లేదు. వయస్సు రీత్యా నేనీ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్హుణ్ణి మాత్రమే’’నని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించారు.
శుక్రవారమిక్కడ టెక్నోజెన్ ఐటీ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సంస్థ సీఈఓ లాక్స్ చీపూరీ మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా ఐటీ సేవలందిస్తున్న సిస్కో టెక్నాలజీ సంస్థే ఈ టెక్నోజెన్ అన్నారు. హెల్త్, మొబిలిటీ, గేమిఫికేషన్, డీడబ్ల్యూ/బీఐ, సీఎక్స్‌ఎం వంటి ఐటీ సేవలను హైదరాబాద్ కేంద్రంగా అందించేందుకు ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాజన్ నటరాజన్, సీఓఓ దీపక్ థాకీర్ తదితరులు పాల్గొన్నారు.