నిఫ్టీ@6,700
రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్న స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ జోరు చూపాయి. 126 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 22,340 వద్ద నిలవగా, 54 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 6,696 వద్ద స్థిరపడింది. ఇవి కొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ ఇండెక్స్‌లు సరికొత్త మైలురాళ్లను అధిగమించాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 6,702ను చేరగా, సెన్సెక్స్ 22,364 పాయింట్లను తాకింది. వెరసి ఈ వారంలో 585 పాయింట్లు జమచేసుకోగా, నిఫ్టీ ఖాతాలో 201 పాయింట్లు చేరాయి.
గడిచిన నాలుగు రోజుల్లో దాదాపు రూ. 6,000 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 1,363 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 208 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. ఎఫ్‌ఐఐల పెట్టుబడులకుతోడు, రూపాయి మారకపు విలువ 60 దిగువకు పుంజుకోవడం, రానున్న ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు సెంటిమెంట్‌కు ఊపునిస్తున్నాయని విశ్లేషకులు వివరించారు.
బ్యాంకింగ్ షేర్ల జిగేల్
బాసెల్-3 నిబంధనల అమలును రిజర్వ్ బ్యాంక్ ఏడాదిపాటు వాయిదా వేయడంతో బ్యాంకింగ్ షేర్ల జోరు మరింత పెరిగింది. ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, కెనరా, బీవోబీ, ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్, ఫెడరల్, యాక్సిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 9-2 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇక ప్రధానిగా మోడీపై అంచనాలతో అదానీ గ్రూప్ షేర్లు వెలుగులో నిలిచాయి. అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ 17-3 శాతం మధ్య జంప్ చేశాయి. మరోవైపు విద్యుత్ షేర్లు లాభాల వెలుగులు విరజిమ్మాయి. ఎన్‌హెచ్‌పీసీ, జేపీ పవర్, పీటీసీ, సీఈఎస్‌సీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్, రిలయన్స్ పవర్ 8-4 శాతం మధ్య పురోగమించడంతో పవర్ ఇండెక్స్ అత్యధికంగా 3 శాతం ఎగసింది.
రియల్టీకి డిమాండ్
ఏప్రిల్ 1న చేపట్టనున్న పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కఠిన విధానాలను వీడుతుందన్న అంచనాలు రియల్టీ షేర్లకు డిమాండ్‌ను సృష్టించాయి. ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూనిటెక్, డీబీ, అనంత్‌రాజ్, ఫీనిక్స్ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ జోష్ మిడ్ క్యాప్స్‌కు కూడా పాకడంతో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఐపీఎల్ టోర్నమెంట్ 7లో చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగనుండటంతో ఇండియా సిమెంట్స్ షేరు 9% దూసుకెళ్లింది. ఇక మిడ్ క్యాప్స్‌లో వీఐపీ, కల్పతరు, బాంబే రేయాన్, ఎస్‌ఆర్‌ఎఫ్, జేకే సిమెంట్ 12-9 శాతం మధ్య పురోగమించాయి.