న్యూఢిల్లీ: బిట్ కాయిన్, ఎథేరియం, రిపిల్, కార్డోనో వంటి క్రిప్టోకరెన్సీ కార్యకలాపాలు ఏవైనా భారత్‌లో కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేధించాలని సూచించిన కమిటీ, దేశంలో ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించే వారిపై జరిమానాలు విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. క్రిప్టోకరెన్సీల నియంత్రణ, నిషేధానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి ‘ది బ్యానింగ్ ఆఫ్ క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2019’ పేరుతో ఒక ముసాయిదా బిల్లును కూడా కమిటీ సిఫారసు చేసింది.
క్రిప్టోకరెన్సీపై ఎటువంటి విధానాలను అవలంభించాలనే అంశంపై సిఫారసులు చేయడానికి కేంద్రం 2017 నవంబర్ 2న కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, సెబీ చైర్మన్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ సభ్యులు. ‘‘ప్రైవేటు క్రిప్టోకరెన్సీతో ఇబ్బం దులు పొంచి ఉన్నాయి. ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం అధికం’’ అని సోమవారం విడుదలైన నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,116 క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ 119.46 బిలియన్ డాలర్లు. తాజాగా కమిటీ నివేదిక, ముసాయిదా బిల్లులను సంబంధిత అన్ని శాఖలు పరస్పర సంప్రతింపుల ద్వారా సమీక్షిస్తాయి. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తాయి. కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment