టీసీఎస్ లాభం జూమ్ | TCS Q4 standalone net up 63.5% at ₹5652.70 cr | Sakshi
Sakshi News home page

టీసీఎస్ లాభం జూమ్

Published Tue, Apr 19 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

టీసీఎస్ లాభం జూమ్

టీసీఎస్ లాభం జూమ్

క్యూ4లో రూ. 6,413 కోట్లు; 73% అప్
* ఆదాయం 17.5 శాతం వృద్ధి; రూ. 28,449 కోట్లు
* షేరుకి రూ.27 చొప్పున తుది డివిడెండ్

ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 6,413 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.3,713 కోట్లతో పోల్చితే.. 73 శాతం దూసుకెళ్లింది. ఇక మొత్తం ఆదాయం సైతం 17.5 శాతం వృద్ధి చెంది రూ.28,449 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఆదాయం రూ.24,220 కోట్లుగా నమోదైంది.
 
సీక్వెన్షియల్‌గానూ జోరు...
డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్(క్యూ3)లో నికర లాభం రూ. 6,083 కోట్లతో పోల్చితే క్యూ4లో(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) 5.4 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా క్యూ3లో రూ.27,364 కోట్లతో పోల్చిచూస్తే 4% వృద్ధి చెందింది. పరిశ్రమ వర్గాలు సగటున క్యూ4లో నికర లాభం సీక్వెన్షియల్‌గా 2.5% మేర, ఆదాయం 3.6 శాతం చొప్పున వృద్ధి చెందవచ్చని అంచనావేశారు. దీనికి మించిన మెరుగైన పనితీరునే టీసీఎస్ నమోదు చేయడం గమనార్హం. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఆకర్షణీయమైన ఫలితాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
 
పూర్తి ఏడాది చూస్తే...
2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం రూ.24,292 కోట్లుగా నమోదైంది. 2014-15 ఏడాదిలో లాభం రూ. 19,852 కోట్లతో పోల్చితే 22.4% వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 14.8 శాతం పెరుగుదలతో రూ.94,648 కోట్ల నుంచి రూ.1,08,646 కోట్లకు ఎగబాకింది.
 
ఫలితాల్లో ముఖ్యాంశాలివీ...
* 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను టీసీఎస్ రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.27 చొప్పున(2,700%) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో పూర్తి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.43.5కు చేరింది.
* కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి వ్యాపారంలో నాలుగో త్రైమాసికానికి 2.6 శాతం వృద్ధిని టీసీఎస్ నమోదు చేసింది. యూరప్ మార్కెట్ వ్యాపారంలో 3.6 శాతం వృద్ధి నమోదైంది.
* పూర్తి ఏడాది ఆదాయాల్లో తొలిసారిగా భారత్ మార్కెట్ నుంచి బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించామని, కొత్త విదేశీ మార్కెట్ల నుంచి 3.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు టీసీఎస్ వెల్లడించింది.
* కంపెనీ 2015-16 ఆదాయాల్లో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ వాటా 15.5 శాతంగా నమోదైంది.
* సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపు స్థాయిలోనే రూ.2,522 వద్ద ముగిసింది. కాగా, వ్యాపారా రహస్యాల చోరీ కేసుకు సంబంధించి అమెరికా ఫెడరల్ కోర్టు టీసీఎస్, టాటా అమెరికా ఇంటర్నేషన్‌లపై 94 కోట్ల డాలర్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇవన్నీ నిరాధార ఆరోపణలని, ఉన్నత న్యాయస్థానాల్లో ఈ తీర్పును సవాలు చేస్తామని టీసీఎస్ ఇప్పటికే పేర్కొంది. ఈ వార్తల ప్రభావంతో సోమవారం ఆరంభంలో షేరు ధర 3 శాతం పైగా పడింది.
 
‘సీజనల్‌గా నాలుగో క్వార్టర్‌లో ఉండే బలహీన ధోరణిని అధిగమించి పటిష్టమైన ఫలితాలను ప్రకటించాం. కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు; రిటైల్, తయారీ రంగాలకు చెందిన ఆదాయాలు పుంజుకోవడం దీనికి ప్రధానంగా దోహదం చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మరింత ఉత్సాహంతో ముందుకెళ్లేందుకు ఈ ఫలితాలు తోడ్పాటునందించనున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆటోమేషన్  వంటి సరికొత్త విభాగాల్లో కొత్త ఉత్పత్తులతోపాటు ‘డిజిటల్’ నైపుణ్యాలను పెంచడంలో మా పెట్టుబడుల జోరును కొనసాగిస్తాం. ఐదేళ్లలో డిజిటల్ బిజినెస్ ఆదాయాన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయి పైకి చేర్చాలన్న లక్ష్యాన్ని అందుకోగలం’.
- ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ ఎండీ, సీఈఓ
 
నియామకాల్లో రికార్డు...
గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నడూలేనంత స్థాయిలో(ఆల్‌టైమ్ హై) స్థూలంగా 90,182 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు టీసీఎస్ పేర్కొంది. ఇక నాలుగో త్రైమాసికం విషయానికొస్తే స్థూలంగా 22,576 నియామకాలు జరిగాయి. ఇదే కాలంలో 13,424 మంది సిబ్బంది వలసపోవడంతో నికరంగా 9,152 మంది ఉద్యోగులు జతయ్యారు.  దీంతో మార్చి చివరినాటికి టీసీఎస్ మొత్తం సిబ్బంది సంఖ్య 3,53,843 మందికి చేరింది. కాగా, 2015-16లో దాదాపు 400 కొత్త డిజిటల్ టెక్నాలజీల్లో 1,20,000 మందికిపైగా టీసీఎస్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్‌ఆర్ గ్లోబల్ హెడ్ అజోయ్ ముఖర్జీ వెల్లడించారు.
 
8-12 శాతం వేతనాల పెంపు...
కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది 8-12 శాతం మేర వేతనాలను పెంచుతున్నట్లు అజోయ్ ముఖర్జీ చెప్పారు. ఈ నెల నుంచి ఈ వేతన పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తుందని తెలిపారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది స్థూల నియామకాల సంఖ్య తగ్గవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా గత కొద్ది నెలలుగా వలసల రేటు తగ్గుముఖం పట్టడం, అధిక ఉత్పాదకత, ఆటోమేషన్ పెరగడం వంటివి దీనికి కారణమని చెప్పారు. రానున్న నెలల్లో దాదాపు 30,000-32,000 మంది ఫ్రెషర్స్‌ను చేర్చుకోనున్నట్లు ముఖర్జీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement