
బెంగళూరు/న్యూఢిల్లీ: మైండ్ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.980కు (మంగళవారం ముగింపు ధర, రూ.950 కంటే ఇది రూ.30 అధికం) కొనుగోలు చేస్తామని ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ ఓపెన్ ఆఫర్‌లో భాగంగా 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం ఎల్ అండ్ టీ రూ.5,030 కోట్లు కేటాయించింది.
ఈ ఓపెన్ ఆఫర్ మే 14న ఆరంభమై అదే నెల 27న ముగుస్తుంది. అవసరానికి మించి బిడ్‌లు వస్తే, ఇష్యూ మేనేజర్లతో సంప్రదించి తగిన దామాషా ప్రాతిపదికన బిడ్‌లను అంగీకరిస్తారు. కాగా ఈ బలవంతపు ఓపెన్ ఆఫర్‌పై కసరత్తు చేయడానికి ఇండిపెండెంట్ డైరెక్టర్లతో కూడిన ఒక ప్యానెల్‌ను మైండ్‌ట్రీ కంపెనీ ఏర్పాటు చేసింది. మరోవైపు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పక్కన బెట్టింది. మైండ్ ట్రీని ఎల్ అండ్ టీ టేకోవర్ చేయడాన్ని మైండ్ ట్రీ వ్యవస్థాపకులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.