
టెలికంలో నష్టాలకు ఆ టెల్కోలే కారణం
టెలికం రంగంలో నష్టాలకు భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి ప్రస్తుత ఆపరేటర్లే కారణమని వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ..
♦ భారీగా ఆర్జించినా టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయడం లేదు
♦ ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్‌పై జియో ఆరోపణ
♦ అంతర్‌మంత్రిత్వ శాఖకు ప్రెజెంటేషన్
న్యూఢిల్లీ: టెలికం రంగంలో నష్టాలకు భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి ప్రస్తుత ఆపరేటర్లే కారణమని వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఆరోపించింది. సదరు సంస్థలు భారీ రుణాలతో వ్యాపారాలను నిర్వహిస్తున్నాయని, సంబంధంలేని రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. అంతర్‌మంత్రిత్వ శాఖల గ్రూప్‌నకు రిలయన్స్ జియో ఈ మేరకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. జియో నెలల తరబడి ఉచిత వాయిస్, డేటా ఆఫర్లిస్తుండటమే టెలికం నష్టాలకు కారణమని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు ఇప్పటిదాకా టెలికం రంగం నుంచి భారీగా ప్రయోజనాలు పొందాయని, ఇక ఇప్పుడు వినియోగదారులు లబ్ధి పొందుతుంటే వివాదం ఎందుకు జరుగుతోందని జియో ప్రశ్నించింది. ఆయా సంస్థలు కొత్త టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయడం మానేసి.. టెలికం రంగ నష్టాలకు బాధ్యతంతా కొత్త ఆపరేటర్‌దేనంటూ తమపై తోసేసే ప్రయత్నం చేస్తున్నాయని జియో ఆరోపించింది.
బోలెడు ఆదాయం గడించాయి..
అనేక సంవత్సరాలుగా ప్రస్తుత ఆపరేటర్లు భారీ స్థాయిలో రాబడులు ఆర్జించినప్పటికీ.. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయలేదని జియో ఆరోపించింది. ఆయా సంస్థలు ఎక్కువగా రుణాలపైనే ఆధారపడ్డాయని పేర్కొంది. ఉదాహరణకు 2010 నుంచి చూస్తే భారత ఎయిర్‌టెల్ రుణ భారం రూ. 2,28,831 కోట్లుగా ఉండగా.. అది కేవలం రూ. 6,978 కోట్లు మాత్రమే వ్యాపారంలో తాజా ఈక్విటీ కింద పెట్టిందని జియో వివరించింది. ఇక ఏడేళ్ల వ్యవధిలో రూ. 32,986 కోట్ల రుణం సమీకరించిన ఐడియా రూ. 3,846 కోట్లు మాత్రమే కొత్తగా ఈక్విటీ కింద సమకూర్చిందని, అటు రిలయన్స్ కమ్యూనికేషన్ సైతం రూ. 56,319 కోట్లు సమీకరించినప్పటికీ రూ. 6,071 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేసిందని జియో పేర్కొంది. సదరు కంపెనీల ప్రమోటర్లు ‘పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని సంబంధం లేని వ్యాపారాల్లో లేదా విదేశీ కంపెనీల కొనుగోళ్లపైనా’ ఇన్వెస్ట్ చేశారే తప్ప సొంత వ్యాపారంలో కొత్త టెక్నాలజీలకు ఊతమివ్వడం కోసం.. తమ వాటాలను విక్రయించి నిధులు సమీకరించేందుకు ఇష్టపడలేదని జియో తెలిపింది.
చిన్న కంపెనీలపై ప్రతికూల ప్రభావం..
స్పెక్ట్రం కొనుగోలు కోసం రుణ లభ్యత సులభతరం చేయడం కూడా ప్రస్తుత ఆర్థిక కష్టాలకు కారణమేనని, దీనివల్ల పరిస్థితులు మరింతగా దిగజారాయని జియో పేర్కొంది. 2014–16 మధ్యకాలంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాల మూలం గా చిన్న ఆపరేటర్ల వ్యాపారం దెబ్బతిందని తెలిపింది. కొత్త ఆపరేటర్లను రానివ్వకుండా టారిఫ్‌లు తదితర విషయంలో ఈ మూడు సంస్థలూ కుమ్మక్కై వ్యవహరించినట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని జియో పేర్కొంది. పోటీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చిన సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ సీవోఏఐ కూడా టెలికం రంగంలో ప్రస్తుత పరిస్థితులకు కారణమేనని వ్యాఖ్యానించింది.