టెల్కోలకు లాక్‌ డౌన్‌ కష్టాలు.. | Telecom operators request mobile phone users | Sakshi
Sakshi News home page

టెల్కోలకు లాక్‌ డౌన్‌ కష్టాలు..

Published Thu, Mar 26 2020 6:12 AM | Last Updated on Thu, Mar 26 2020 6:12 AM

Telecom operators request mobile phone users - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భయాల కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో టెలికం సంస్థలు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఓవైపు కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని అమలు చేస్తుండటం, మరోవైపు ఇంటి పట్టునే ఉండాల్సి రావడంతో ప్రజలు కాలక్షేపం కోసం ఎక్కువగా ఇంటర్నెట్‌నే వినియోగిస్తుండటంతో డేటా వినియోగం భారీగా పెరిగిపోతోంది. నెట్‌వర్క్‌లపై భారం పడి స్పీడ్‌ తగ్గిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. గడిచిన కొద్ది వారాల్లో ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ) నెట్‌వర్క్‌ ద్వారా ట్రాఫిక్‌ ఏకంగా 30 శాతం పైగా ఎగిసినట్లు టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోకుండా చూసేందుకు టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు నానా తంటాలు పడుతున్నాయి.

వర్క్‌ ఫ్రం హోం చేసే వారికి, అత్యవసర సర్వీసులకు ఆటంకం కలగకుండా టెలికం సంస్థలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. డేటా వినియోగం భారీగా పెరిగినా ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు ఈ మేరకు తమ యూజర్లకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నెట్‌వర్క్‌లపై అదనపు భారం పడినా సమర్థంగా సర్వీసులు అందించగలిగేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా సంస్థలు తెలిపాయి. పరిస్థితి మరింత దిగజారితే అత్యవసర ప్రణాళికలు అమలు చేసేలా సర్వసన్నద్ధంగా ఉండేందుకు.. టవర్ల సంస్థలు, టెలికం ఇన్‌ఫ్రా సంస్థలు, సర్వీస్‌ ప్రొవైడర్లతో ఎప్పటికప్పుడు సంప్రతింపులు జరుపుతున్నామని ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విఠల్‌ తెలిపారు.  

జియో బేసిక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు..
భౌగోళికంగా అనువైన ప్రాంతాల్లో దాదాపు 10 ఎంబీపీఎస్‌  దాకా స్పీడ్‌తో ప్రాథమిక బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఇస్తామంటూ రిలయన్స్‌ జియో ప్రకటించింది. ప్రస్తుతం వీటికి సర్వీస్‌ చార్జీలేమీ వసూలు చేయబోమని తెలిపింది. నామమాత్రపు రీఫండబుల్‌ డిపాజిట్‌తో హోమ్‌ గేట్‌వే రూటర్లు కూడా అందిస్తామని ఒక ప్రకటనలో వివరించింది. ఇక వాయిస్, డేటా వినియోగ ధోరణులను పరిశీలిస్తున్నామని, లాక్‌డౌన్‌ వ్యవధిలో పెరిగే డిమాండ్‌కు తగ్గట్లుగా సర్వీసులు అందించగలమని వొడాఫోన్‌ ఐడియా ధీమా వ్యక్తం చేసింది.  

ఓటీటీ ప్లాట్‌ఫాంలతో సంప్రతింపులు..
డేటా ట్రాఫిక్‌ సమస్యను అధిగమించే చర్యల్లో భాగంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ (ఓటీటీ) సంస్థలతోనూ టెల్కోలు చర్చలు జరిపాయి. సర్వీసులను క్రమబద్ధీకరించుకోవాలని, వీడియో క్వాలిటీని తగ్గించాలని కోరాయి. ‘హై డెఫినిషన్‌ (హెచ్‌డీ) నుంచి స్టాండర్డ్‌ డెఫినిషన్‌ (ఎస్‌డీ) స్థాయికి వీడియో నాణ్యతను తగ్గించిన పక్షంలో డేటా ట్రాఫిక్‌ కనీసం 15–20 శాతం తగ్గుతుంది. తద్వారా నెట్‌వర్క్‌పై ఆ మేరకు భారం కూడా తగ్గుతుంది‘ అని టెలికం పరిశ్రమ వర్గాలు వివరించాయి. ‘డిజిటల్‌ వినియోగం ఒక్కసారిగా ఎగియడంతో టెలికం సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (టీఎస్‌పీ) నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఇప్పటికే భారీగా ఒత్తిడి పెరిగిపోయింది.

ప్రస్తుత కీలక సమయంలో భారాన్ని తగ్గించుకునేందుకు, నెట్‌వర్క్‌లు సజావుగా పనిచేసేలా చూసేందుకు టీఎస్‌పీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి‘ అని వీడియో స్ట్రీమింగ్‌ సంస్థలకు టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఒక లేఖ రాసింది. వీడియో నాణ్యత స్థాయిని హెచ్‌డీ నుంచి ఎస్‌డీకి తగ్గించడం ద్వారా నెట్‌వర్క్‌లపై డేటా ట్రాఫిక్‌పరమైన ఒత్తిళ్లు తగ్గేందుకు సహకరించాలని కోరింది. దీనికి వీడియో స్ట్రీమింగ్‌ సంస్థలు కూడా సుముఖత వ్యక్తం చేశాయి. సర్వీస్‌ నాణ్యత దెబ్బతినకుండానే భారత్‌లో టెలికం నెట్‌వర్క్‌పై భారం 25 శాతం దాకా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. అటు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ తమ వెబ్‌సైట్లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వీడియోల బిట్‌ రేటును తాత్కాలికంగా తగ్గిస్తామని పేర్కొంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వంటి సంస్థలు కూడా టెలికం నెట్‌వర్క్‌పై భారం పడకుండా బిట్‌ రేటును తగ్గిస్తున్నాయి.  

ప్రజలకు కూడా సీవోఏఐ విజ్ఞప్తి..
ప్రజలు కూడా అత్యవసర సర్వీసులకు విఘాతం కలగనివ్వకుండా.. నెట్‌వర్క్‌ను బాధ్యతాయుతంగా వాడాలని సీవోఏఐ విజ్ఞప్తి చేసింది. ‘రిమోట్‌ వర్కింగ్, ఆన్‌లైన్‌ విద్యాసేవలు, డిజిటల్‌ వైద్య సేవలు, చెల్లింపులు తదితర ఇతరత్రా కీలకమైన సర్వీసులకు విఘాతం లేకుండా ఇంటర్నెట్, నెట్‌వర్క్‌ను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం‘ అని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement