కొత్త పెట్టుబడులు... క్రాష్!
♦ ఏప్రిల్– జూన్ మధ్య భారీగా తగ్గిన పెట్టుబడులు
♦ ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు 448 మాత్రమే...
♦ వీటి విలువ రూ.1.35 లక్షల కోట్లుగా అంచనా...
♦ గడిచిన మూడేళ్లలో త్రైమాసిక సగటు 2.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇది ఏమంత ఫలితాలిస్తున్నట్లు కనిపించటం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2017–18, ఏప్రిల్–జూన్) దేశీయంగా కొత్త పెట్టుబడులు భారీగా పడిపోవటమే దీనికి నిదర్శనం. జూన్ క్వార్టర్‌లో భారతీయ కార్పొరేట్ సంస్థలు కేవలం 448 కొత్త ప్రాజెక్టులను మాత్రమే ప్రకటించాయి.
వీటికి సంబంధించి పెట్టుబడుల అంచనా రూ.1.35 లక్షల కోట్లు. గడిచిన మూడేళ్లలో త్రైమాసిక ప్రాతిపదికన కార్పొరేట్లు ప్రకటించిన సగటు పెట్టుబడుల విలువ రూ.2.2 లక్షల కోట్లుగా లెక్కతేలుతుండటం గమనార్హం. అంటే సగటున చూసుకుంటే ఈ త్రైమాసికంలో ఏకంగా రూ.85 వేల కోట్ల వరకూ తగ్గుదల కనిపిస్తోంది. మరోవంక ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో ప్రకటించిన కొత్త పెట్టుబడుల విలువ రూ.2.95 లక్షల కోట్లు కావడం గమనార్హం. రీసెర్చ్ సంస్థ సీఎంఐఈ ఈ గణాంకాలను వెల్లడించింది.
సామర్థ్య వినియోగం 75 శాతం వద్దే...
వాస్తవానికి కొత్త పెట్టుబడి ప్రకటనలనేవి అటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ రంగంలో కూడా కంపెనీల వ్యాపార విశ్వాసానికి కొలమానంగా భావిస్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు గత మూడేళ్లుగా దేశంలో ఉద్యోగాల కల్పన, అదేవిధంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ వంటి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ పెట్టుబడులు జోరందుకోకపోగా.. తగ్గుముఖం పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్లాంట్ల సామర్థ్య వినియోగం (కెపాసిటీ యుటిలైజేషన్) ఇంకా 75 శాతం వద్దే కొట్టుమిట్టాడుతోందని కంపెనీల చీఫ్‌లు చెబుతున్నారు.
ఈ యుటిలైజేషన్ పూర్తిస్థాయికి చేరుకుంటే తప్ప కొత్త పెట్టుబడులవైపు కంపెనీలు దృష్టిసారించే అవకాశం లేదనేది వారి అభిప్రాయం. దీనికితోడు మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య తీవ్రతరం కావడంతో ఇప్పుడు బ్యాంకులన్నీ వసూళ్లపై సీరియస్‌గా దృష్టి పెట్టడం కూడా కంపెనీల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారీగా ఎన్‌పీఏలు పేరుకుపోయిన టెలికం, స్టీల్, విద్యుత్ వంటి రంగాల్లో కొత్త ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చే పరిస్థితి కనబడటం లేదు.
పాత ప్రాజెక్టుల రద్దు..
జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ప్రాజెక్టుల పూర్తికి సంబంధించిన కార్యకలాపాలు కూడా మందకొడిగానే ఉన్నాయి. కేవలం రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను మాత్రమే కంపెనీలు పూర్తిచేసి ప్రారంభించగలిగాయి. ఈ కాలంలో పూర్తయిన అతిపెద్ద ప్రాజెక్టు జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్‌పీఎల్)కు చెందిన అంగుల్ స్టీల్ ప్లాంట్ ఫేజ్–1 కావడం విశేషం. దీని పెట్టుబడి విలువ రూ.33,000 కోట్లుగా అంచనా. ఇక రూ.14,000 కోట్ల పెట్టుబడితో తలపెట్టిన బెంగళూరు మెట్రో ఫేజ్–1 కూడా ఇదే క్వార్టర్‌లో పూర్తయి.. పట్టాలెక్కింది. అయితే, గతంలో ప్రకటించిన 52 కొత్త ప్రాజెక్టులు జూన్ త్రైమాసికంలో రద్దు కావడం గమనార్హం. ఇందులో ప్రధానంగా గుజరాత్‌లో తలపెట్టిన మిథివర్ది అణు విద్యుత్ ప్లాంట్ ఉంది.
రూ.60,000 కోట్ల పెట్టుబడి అంచనాతో 6,000 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్‌పీసీఐఎల్ దీన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే, భూసేకరణ ఇతరత్రా సమస్యలతో దీన్ని పక్కనబెట్టింది. ఇక ఒడిశాలోని పారదీప్ వద్ద దక్షిణ కొరియా దిగ్గజం 12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోస్కో ప్రతిపాదించిన స్టీల్‌ప్లాంట్ కూడా ఈ రద్దయిన జాబితాలో ప్రధానమైనదే. దీని పెట్టుబడి అంచనా రూ.50,000 కోట్లు. మొత్తంమీద మార్చి–జూన్ మధ్య రద్దయిన ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడుల విలువ రూ.2.4 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. అదేవిధంగా వివిధ అడ్డంకుల కారణంగా రూ.2.4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు జూన్ క్వార్టర్‌లో నిలిచిపోయాయి. జనవరి–మార్చిలో ఇలా నిలిచిపోయిన ప్రాజెక్టుల విలువ రూ.35,000 కోట్లు మాత్రమే.