సోలార్ ఇన్వర్టర్ల తయారీలోకి సురానా
కంపెనీ చైర్మన్ నరేందర్ సురానా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ రంగంలో ఉన్న సురానా... సోలార్ ఇన్వర్టర్ల తయారీలోకి ప్రవేశిస్తోంది. ఎనర్జీ స్టోరేజ్ ఉపకరణాలను సైతం ఉత్పత్తి చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఫ్యాబ్‌సిటీలో ఉన్న కంపెనీకి చెందిన ప్లాంటులో వీటిని రూపొందిస్తారు. ఇందుకోసం చైనా కంపెనీ సోఫార్ సోలార్‌తో చేతులు కలిపినట్లు సురానా సోలార్ చైర్మన్ నరేందర్ సురానా సాక్షి బిజినెస్ బ్యూరోకు గురువారం తెలిపారు. ఎంత పెట్టుబడి పెట్టేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. తొలి ఏడాది 5 మెగావాట్ల ఉపకరణాలను ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు.
మూడు నెలల్లో తొలి ఉత్పాదన ప్రవేశపెడతామని, 11 ఏళ్లపాటు మన్నిక ఉండేలా వీటికి రూపకల్పన చేస్తామని చెప్పారాయన. ‘2017–18లో 31 మెగావాట్ల సౌర విద్యుత్, రూఫ్‌టాప్ ప్రాజెక్టులు చేపడుతున్నాం. కాకినాడలో స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు కింద ప్రభుత్వ కార్యాలయాలకు 4 మెగావాట్ల మేర రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తున్నాం. గజ్వేల్ దగ్గర 6 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు జూన్‌కల్లా సిద్ధం అవుతుంది. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రైవేటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నాం. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.150 కోట్లు వ్యయం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 60 మెగావాట్ల ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశాం’ అని తెలిపారు.