వీడియోకాన్ డీ2హెచ్ ఆదాయం 33 శాతం అప్
హైదరాబాద్: డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) రంగంలో సేవలందించే వీడియోకాన్ డీ2హెచ్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,338 కోట్ల నిర్వహణ ఆదాయం ఆర్జించింది. ఇది అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నిర్వహణ ఆదాయం కంటే 33 శాతం అధికమని వీడియోకాన్ డీ2హెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. చందా ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.2,058 కోట్లకు చేరిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ పేర్కొన్నారు. ఇబిటా 55 శాతం వృద్ధితో రూ.609 కోట్లకు చేరిందని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో విజయవంతగా తమ కంపెనీ లిస్ట్ అయిందని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి అంచనాలు జోరుగా ఉన్నాయని, భవిష్యత్తులో మీడియా రంగం మంచి అభివృద్ధిని సాధిస్తుందని కంపెనీ సీఈఓ అనిల్ ఖేరా తెలిపారు. టీవీల విస్తరణ, హెచ్‌డీ వినియోగం పెరుగుతుండడం వంటి కారణాల వల్ల రాబడులు పెరుగుతాయన్నారు.