
క్యారెట్‌లేన్ వర్చువల్ జ్యువెల్లరీ యాప్ విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో ఆభరణాల విక్రయించే క్యారెట్‌లేన్.. వినూత్న యాప్‌ను విడుదల చేసింది. క్యారెట్‌లేన్ వర్చువల్ జ్యువెల్లరీ యాప్‌తో త్రీడీ ఇమేజింగ్ టెక్నాలజీ ఆధారంగా ఫొటో తీసుకోవచ్చని, శరీరానికి నప్పే విధంగా ఉండే నగలను కొనుగోలు చేయవచ్చని సంస్థ సీఈఓ మిథున్ సాచేటి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి దశలో చెవి రింగులు, నగలను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చామని... త్వరలోనే ఇతర ఆభరణాలనూ తీసుకొస్తామని తెలియజేశారు. ప్రస్తుతం క్యారెట్‌లేన్ లక్షకు పైగా కస్టమర్లతో 150 నగరాల్లో విస్తరించి ఉంది. ఆఫ్‌లైన్‌లో క్యారెట్‌లైన్‌కు 7 నగరాల్లో 10 స్టోర్లున్నాయి.