
సాక్షి, ముంబై: ఉచిత డేటా, ఉచిత కాలింగ్ అంటూ టెలికాం మార్కెట్‌లోకి దూసుకువచ్చిన రిలయన్స్ జియో ఇటీవల చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టి వినియోగదారులకు షాకిచ్చింది. దీంతో ప్రత్యర్థి ఆపరేటర్ వోడాఫోన్ తన వినియోగదారుల బేస్‌ను విస్తరించే చర్యల్లో భాగంగా రెండు కొత్త డేటా ప్లాన్లను వెల్లడించింది. ముఖ‍్యంగా జియోకు కౌంటర్‌గా శుక్రవారం సరికొత్త ప్లాన్లను ప్రకటించింది. వీటిల్లో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది.
ముఖ్యంగా కొత్త వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో రూ. 496 మొదటి రీచార్జ్‌పై ఉచిత కాలింగ్ సదుపాయాన్ని రోజుకు 1 జీబీ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఇక రెండవ ప్లాన్‌లో కొత్త వినియోగదారుడు రూ .177 రీచార్జ్‌పై అపరిమిత కాలింగ్ సదుపాయంతోపాటు, రోజుకు 1 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
ఇన్నాళ్లూ చౌకగా అందించిన ప్లాన్స్‌ను పెంచుకుంటూ పోతున్న జియో దీపావళి సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన 491 రూపాయల ప్లాన్‌ను 499 రూపాయలకు పెంచేసిన సంగతి తెలిసిందే.
కాగా వోడాఫోన్ తాజాగా (గురువారం) తక్కువ కాల వ్యవధి ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో వారం రోజుల ప్లాన్‌లో రూ.69 రీచార్జ్‌పై 500 ఎంబీ, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఆఫర్ చేస్తోంది.