
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. సోషల్ మీడియాలో డేటా చోరీ వార్తలు భయపెడుతున్న తరుణంలో వాట్సాప్ ఒక సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. వాట్సాప్ వినియోగదారుల సంభాషణలు ఇతరులు చూడకుండా కాపాడేందుకు ఆండ్రాయిడ్ వెర్షన్లో వాట్సాప్‌కు ఫింగర్ ప్రింట్ అధెంటికేషన్ ఆప‍్షన్ తీసుకరానుంది. ఇకపై వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలంటే వేలిముద్ర అవసరమని మంగళవారం వెల్లడైన ఒక నివేదిక తెలిపింది.
తాజా నివేదికల ప్రకారం ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్ తీసుకురానున్న ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫీచర్ పరీక్ష, ప్రయోగ దశలో ఉంది. ఈ ఫీచర్ నిర్దిష్ట సంభాషణలను కాపాడటమే కాదు, మొత్తం యాప్‌కు భద్రత నిస్తుందనీ, ఇతరులకు మన వాట్సాప్ యాక్సెస్‌ను నియంత్రిస్తుందనీ.. అంటే వాట్సాప్‌లో మన చాటింగ్‌కు స్పెషల్‌గా లాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. డైరెక్టుగా యాప్‌కే ఫింగర్ ప్రింట్ ఫీచర్ రక్షణనిస్తుందని వాబ్ఈటల్ ఇన్ఫో అనే వెబ్‌సైట్ నివేదించింది.
కాగా పరీక్షల దశను విజయవంతంగా పూర్తి చేసుకుని..లాంచింగ్ అయితే...ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్(వేలిముద్ర ప్రామాణీకరణ) ఫీచర్ సెట్టింగ్స్‌లో అకౌంట్.. ప్రైవసీ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.