కొత్త ఏడాది స్టాక్ మార్కెట్ వెలుగులు విరజిమ్ముతుందా? పుత్తడి మిలమిలలుంటాయా? రూపాయి పరుగు కొనసాగుతుందా? ముడి చమురు ధరల కదలికలు ఎలా ఉంటాయ్? ఈ నాలుగు దిక్కులూ ఏం చెబుతున్నాయి?..
సాక్షి బిజినెస్ ప్రత్యేకం: ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, పటిష్టమైన డాలరు తదితర అంశాలతో పసిడి ధరలు 2018లో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా రేట్లు గణనీయంగా క్షీణించి ఔన్సు (31.1 గ్రాములు) ధర 1,200 డాలర్ల దిగువకు పడిపోయింది. కాకపోతే కనిష్ట స్థాయిల నుంచి మళ్లీ 9 శాతం మేర కోలుకోవడం పసిడి పటిష్టంగానే ఉందన్న సంకేతాలిస్తోంది. ఇక 2019 విషయానికొస్తే.. వాణిజ్య యుద్ధభయాలు, రాజకీయ వివాదా లు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీని ఉపసంహరిస్తుండటం వంటివి ప్రపంచ ఎకానమీకి ప్రధాన రిస్కులు కాబోతున్నాయి. స్వల్పకాలికంగా చూస్తే చాలా దేశాల వృద్ధి రేటు క్రమంగా నెమ్మదిస్తోంది. ఇవన్నీ ఇన్వెస్టర్ల విశ్వాసం, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, వృద్ధి మొదలైన వాటిపై ప్రతికూల ప్రభా వం చూపవచ్చు.
రాజకీయ–భౌగోళిక టెన్షన్లు.. ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లను కుదిపేయవచ్చు. ఈక్విటీ, బాండ్, కరెన్సీ మార్కెట్లు అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకులకు లోను కావచ్చు. చాలా దేశాల్లోని ఆర్థిక, ద్రవ్య, రాజకీయ విధానాలు చూస్తుంటే.. పసిడి ధరలకు మరింత మద్దతు లభించే సూచనలే కనిపిస్తున్నాయి. స్థూల ఆర్థికాంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. బంగారం రేట్లు క్రమంగా పెరగవచ్చు. కాబట్టి పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం బంగారంలో పెట్టుబడులను పరిశీలించవచ్చు. పోర్ట్‌ఫోలియోకి ఉండే రిస్కులను తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడొచ్చు.
– చిరాగ్ మెహతా, సీనియర్ ఫండ్ మేనేజర్, క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్
రూపాయి జోరు..
డాలర్‌తో రూపాయి మారకం విలువ 2018లో 9 శాతం క్షీణించింది. కొత్త ఏడాదిలో రూపాయి పరిస్థితి కొంచెం మెరుగుపడవచ్చు. క్రూడ్ ధరలు పతనమైతే... ఆ మేరకు రూపాయి పుంజుకుంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక పథకాలు వెల్లువెత్తే అవకాశాలుండటం రూపాయిపై ప్రతికూల ప్రభావంపడచ్చు. 2019లో రూపాయి 68–70 రేంజ్‌లో కదలాడవచ్చు. కాగా రూపాయి విలువ సోమవారం 18 పైసలు పెరిగి 69.77 వద్ద ముగిసింది.
చమురు బేజారు..
ముడి చమురు ధరలు 2018లో తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఇదే స్థాయి హెచ్చుతగ్గులు ఈ ఏడాది కూడా కొనసాగవచ్చు. ధరలు పెరిగే అవకాశాలు పెద్దగా లేవు. అలాగని భారీగా తగ్గే అవకాశాలూ తక్కువే. ఎందుకంటే బ్యారెల్ ధర 50 డాలర్లకన్నా దిగువకు చేరితే ఉత్పత్తిని తగ్గిస్తామని ఒపెక్ దేశాలు ఇప్పటికే చెప్పాయి. మొత్తంగా బ్రెంట్ చమురు 55– 65 డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చు.
స్టాక్ మార్కెట్ కళకళ..
గత ఏడాది మాదిరే కొత్త సంవత్సరంలోనూ ఒడిదుడుకులు కొనసాగుతాయి. లోక్‌సభ ఎన్నికలు కీలకం కానున్నాయి. బీజేపీకి కానీ, కాంగ్రెస్‌కి కానీ ఏదో ఒక పెద్ద పార్టీకి ఎక్కువ సంఖ్యలో లోక్‌సభ స్థానాలు వస్తే, మార్కెట్ జోరును ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఆర్‌బీఐ రేట్ల పాలసీలూ, ముడి చమురు ధరల కదలికలు, అమెరికా–చైనాల వాణిజ్య సంబంధాలు... ఇవన్నీ ప్రభావం చూపే వే. మొత్తం మీద సెన్సెక్స్ ఈ ఏడాది కూడా 5 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయనేది నిపుణుల మాట. నిఫ్టీ ఏడాది చివరికు 11,500 పాయింట్లకు చేరవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment