ఆ ముప్పు చెప్పిన తొలి టెక్ దిగ్గజం విప్రో
ఆ ముప్పు చెప్పిన తొలి టెక్ దిగ్గజం విప్రో
Published Fri, Jun 9 2017 9:01 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
బెంగళూరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరమైన నిబంధనలతో భారత్ ఐటీ కంపెనీలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ట్రంప్ దెబ్బను తట్టుకోలేక ఓ వైపు నుంచి హెచ్-1బీ వీసాల్లో భారీగా కోత పెడుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా డొనాల్డ్ ట్రంప్ చర్యలు తమ ఐటీ కంపెనీలను ఏ మేరకు దెబ్బతీయనున్నాయో అధికారికంగా ప్రకటించలేదు. పరోక్షంగా మాత్రం ట్రంప్ చర్యలను ఎండగడుతూనే ఉన్నాయి. తొలిసారి దేశీయంగా మూడో టెక్ దిగ్గజంగా పేరున్న విప్రో అధికారికంగా ట్రంప్ ముప్పును బహిరంగంగా వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ తమకు తీవ్ర ముప్పుగా ఉన్నారని, ఇన్ని ఏళ్లలో తొలిసారి అమెరికా అధ్యక్షుడి వల్ల తమకు నష్టం వాటిల్లనున్నట్టు విప్రో అమెరికా సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వార్షిక ఫైలింగ్ లో పేర్కొంది. భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు, ఉగ్రవాదుల దాడులతో తమ వ్యాపారాలు, రెవెన్యూలు, లాభాలకు భారీగా దెబ్బతీయనున్నాయని తెలిపింది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షుడి ఎన్నిక తమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది.
అదేవిధంగా అమెరికాతో పాటు యూకే, సింగపూర్, ఆస్ట్రేలియాలు కూడా ఇమ్మిగ్రేషన్ చట్టాల విషయంలో ట్రంప్ బాటలో నడుస్తున్నాయి. ట్రంప్ ను అనుసరిస్తూ ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చాయి. ఇవి కూడా తమకు ముప్పుగా ఉన్నాయని విప్రో తెలిపింది. ఈ నిబంధనలు తమపై ఎలా ప్రభావం చూపనున్నాయో పూసగుచ్చినట్టు కంపెనీ వివరించింది. ట్రంప్ అనుసరిస్తున్న రక్షణవాద చర్యలు దేశీయ ఐటీ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటినీ నుంచి ఐటీ కంపెనీలు స్థానికంగా రిక్రూట్ మెంట్లను పెంచి, వీసాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తామని చెబుతూనే ఉన్నాయి. తొలి క్వార్టర్ ముగిసే లోపల, తమ కంపెనీలో 50 శాతానికి పైగా ఉద్యోగులు స్థానికులై ఉంటారని విప్రో పేర్కొంది. ఇటు ఇన్ఫోసిస్ కంపెనీ సైతం వచ్చే రెండేళ్లలో 10వేల మంది అమెరికన్లను రిక్రూట్ మెంట్ చేసుకోనున్నట్టు ప్రకటించింది.
Advertisement